Share News

ఇక గ్రూపులు లేవు.. షిండే నేతృత్వంలోనిదే అసలైన శివసేన.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:48 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇక గ్రూపులు లేవు.. షిండే నేతృత్వంలోనిదే అసలైన శివసేన.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Amit Shah Declares Eknath Shinde-Led Shiv Sena as the Only Shiv Sena Amid UBT Rebellion

కొల్హాపూర్, జూన్ 20: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీలో తీవ్ర తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ(శనివారం) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. శివసేన(UBT)లో ఇక ఎలాంటి గ్రూపులు లేవని, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలో నడుస్తున్నదే ఏకైక అసలైన శివసేన అని ఆయన స్పష్టం చేశారు. కొల్హాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

'షిండే గ్రూప్' అనాల్సిన అవసరం లేదు

సభను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ.. 'గతంలో మనం ఏకనాథ్ షిండే పేరును ప్రస్తావిస్తూ 'శివసేన షిండే గ్రూప్' అని పిలవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి గ్రూపులు లేవు. ఒకే ఒక్క శివసేన ఉంది. అది షిండే నేతృత్వంలోనిదే' అని ప్రకటించారు.

అంతకుముందు కొల్హాపూర్‌లోని ప్రముఖ మాతా అంబాబాయి ఆలయాన్ని సందర్శించిన అమిత్ షా.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే ఆలయ ఆధునీకీకరణ, కారిడార్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'వికాస్ భీ, విరాసత్ భీ(అభివృద్ధి, వారసత్వం)' అనే సంకల్పంతోనే దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని, మహారాష్ట్రలోని అన్ని జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు.


ఉద్ధవ్ ఠాక్రే పార్టీలో 'ఆపరేషన్ టైగర్'

మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(UBT) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు సమూహంగా ఏర్పడి ఏకనాథ్ షిండే వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారని, దీనికి 'ఆపరేషన్ టైగర్'అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఉద్ధవ్ వర్గంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ ఎంపీల బహిరంగ అసమ్మతి, బెదిరింపులు, చట్టపరమైన చర్యల హెచ్చరికలతో ఉద్ధవ్ శిబిరంలో కలవరం మొదలైంది.

ఎంపీలకు షోకాజ్ నోటీసులు - అనర్హత వేటు హెచ్చరిక

ఢిల్లీలో ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే పక్షం అత్యవసరంగా నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ చీలికను స్పష్టం చేసింది. ఆ పార్టీకి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలలో ముగ్గురు(అరవింద్ సావంత్, అనిల్ దేశ్‌రాయ్, రాజభావు వాజే) మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు నాగేష్ ఆష్టికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, ఓంప్రకాష్ రాజేనింబాల్కర్, భావుసాహెబ్ వాక్‌చౌరే ఈ సమావేశానికి హాజరు కాలేదు.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన శివసేన చీఫ్ విప్ అనిల్ దేశాయ్, గైర్హాజరైన ఆరుగురు ఎంపీలకు 'షోకాజ్' నోటీసులు జారీ చేశారు. వారికి కేవలం 24 గంటల గడువు ఇచ్చారు. నిర్ణీత సమయంలోగా వారు లిఖితపూర్వకంగా సరైన కారణాలు చెప్పకపోతే, వారు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం వారిపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడానికి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు.

ఉద్ధవ్ వర్గంలో ఎంపీల తిరుగుబాటు ఊహాగానాలు నిజమవుతున్న తరుణంలో, అధికారిక శివసేన షిండేదేనంటూ అమిత్ షా చేసిన తాజా ప్రకటన మహారాష్ట్ర రాజకీయాలను ఊహించని మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 20 , 2026 | 04:13 PM