Share News

మతం మారితే ఇంట్లో బంధిస్తారా?

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:54 AM

ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

మతం మారితే ఇంట్లో బంధిస్తారా?
Allahabad High Court

అక్కాచెల్లెళ్లను తండ్రి నిర్బంధించడాన్ని తప్పుబట్టిన అలహాబాద్‌కోర్టు

ప్రయాగ్‌రాజ్‌: ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. యూపీకి చెందిన దియా భాటియా అలియాస్‌ జోయా (20), అన్షు భాటియా అలియాస్‌ అమీనా (35) 2021లో ఇస్లాం స్వీకరించారు. ఇది ఇష్టంలేని తండ్రి, ఆ ఇద్దరినీ ఇంట్లోని గదిలో పెట్టి తాళం వేశాడు.


అయితే ఆ అక్కాచెల్లెళ్ల తరఫున ఓ వ్యక్తి ఈ ఘటనపై అలహాబాద్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. అటు.. ఆ సోదరీమణుల తండ్రి కూడా తన కూతుళ్లను హిందూమతం నుంచి బలవంతంగా, మోసపూరితంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపిస్తూ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ సందీప్‌ జైన్‌ విచారించారు. తాము ఎవరి ఒత్తిడితోనో కాకుండా పూర్తి ఇష్టపూర్వకంగానే మానసిక ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరించామని ఆ సోదరీమణులు కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.


కాగా ఈ అక్కాచెల్లెళ్లు మతం మారడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ కోర్టులో యూపీ ప్రభుత్వం వాదించింది. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మేజర్లు అని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునేందుకు న్యాయపరమైన స్వేచ్ఛ వారికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అక్కాచెల్లెళ్లకు కోరుకున్న చోట, కోరుకున్న వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది.

Updated Date - Aug 12 , 2026 | 07:56 AM