నిఖా హలాలా ముసుగులో మహిళలపై లైంగిక వేదింపులను సహించలేం
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:40 AM
నిఖా హలాలా, ట్రిపల్ తలాఖ్ పేరుతో మహిళలపై లైంగికవేధింపులను సహించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి నేరపూరిత చర్యలకు మతపరమైన చట్టాల ముసుగులో...
నేరాలకు మతపరమైన చట్టాలు
రక్షణ కల్పించలేవు: అలహాబాద్ హైకోర్టు
ట్రిపుల్ తలాక్, హలాలా మాటున తనపై
లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ భర్త,
బంధువులు సహా 9మందిపై మహిళ కేసు
లఖ్‌నవూ, జూలై 3: నిఖా హలాలా, ట్రిపల్ తలాఖ్ పేరుతో మహిళలపై లైంగికవేధింపులను సహించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి నేరపూరిత చర్యలకు మతపరమైన చట్టాల ముసుగులో రక్షణ లభించదని కీలక వ్యాఖ్యలు చేసింది. బాల్య వివాహం, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, పునర్‌వివాహం పేరుతో తనపై భర్త, ఓ మౌలానా (మతపెద్ద), బంధువులు సహా తొమ్మిది మంది పదే పదే లైంగికవేధింపులకు పాల్పడ్డారంటూ యూపీకి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టి స్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం నిందితుల అభ్యర్థనను తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులపై తీవ్రమైన నేరారోపణలున్నాయని, వాటిలో ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాక్ ఆచారం ప్రకారం భర్త మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులివ్వొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టం చేసింది. నిఖా హలాలా అంటే.. విడాకులిచ్చిన మహిళను ఆమె మాజీ భర్తే మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆలోపు ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిపించాలి. ఆ వ్యక్తితో ఆమె సన్నిహితంగా గడపాలి. అనంతరం అతను స్వచ్ఛందంగా ఆమెకు విడాకులివ్వాలి. ఆ తర్వాతే మొదటి భర్త, ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోవొచ్చు. నిఖాహలాల్‌ను అడ్డుపెట్టుకొని భర్త, అతడి సోదరుడు, బంధువులు, ఓ మతపెద్ద లైంగిక వేధింపులకు ఒడిగట్టారని ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. కాగా ఈ కేసుకు సంబంధించి ట్రిపుల్ తలాక్, నిఖా హ లాలా అనే ఆచారాలు సమాజంలోని చీకటి అధ్యాయాలుగా కనిపిస్తున్నాయని, మహిళపై వేధింపులు సమాజాన్ని తలదించుకునేలా చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్‌ఐఆర్ రద్దు చేయడానికి సరైన కారణాలు కనిపించడం లేదని తీర్పు వెలువరించింది.
అసలేమిటీ కేసు?
ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం బాధిత యువతిది అంబాలా జిల్లా. 2015 ఏప్రిల్‌లో 15ఏళ్ల ప్రాయంలో ఆమెకు బాల్య వివాహం జరిగింది. అజహర్ నవాజ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకున్నాడు. 2016 జనవరిలో ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పి వదిలించుకున్నాడు. ఆ తర్వాత ఆమెనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే సాకుతో 2017లో బాధితురాలిని బలవంతంగా మౌలానా ఖయ్యూ మ్ అనే ఓ మతపెద్దకు ఇచ్చి పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత బాధితురాలిని అజహర్ మళ్లీ పెళ్లి చేసుకొని 2021లో తలాక్ చేప్పేసి, కొన్నాళ్లకు రాజీకొచ్చాడు. ఈ సమయంలో అజహర్ సోదరుడు షానవాజ్, మరో బంధువు హకీం నిషాత్ రంగప్రవేశం చేసి బాధితురాలితో మాట్లాడారు. అజహర్‌తో మళ్లీ పెళ్లి జరిగేందుకు షరతులు పెట్టారు. అప్పటికే రెండుసార్లు విడాకులైందని, ఫలితంగా నిఖా హలాల్ కూడా రెండుసార్లు జరగాలని ఆమెను భయపెట్టారు. 2025 ఫిబ్రవరిలో నిఖా హలాల్ తంతుపేరిట ఆమెపై షానవాజ్, హకీం అత్యాచారం జరిపారు. అనంతరం అజహర్‌తో వైవాహిక సంబంధం కొనసాగించేందుకు ఆమెకు నకిలీ వివా హం జరిపించారు. కాగా మొదటి నిఖా హలాలా సమయంలోనే ఆమె మైనర్ (17ఏళ్లు) అని కోర్టు తీర్పులో గుర్తుచేయడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..