కాంగ్రెస్‌పై అసంతృప్తి.. INDIA కూటమి మీటింగ్‌కు అఖిలేశ్ డుమ్మా!
ABN , Publish Date - Sep 30 , 2026 | 01:22 PM
తాజాగా INDIA కూటమి నిర్వహించిన కీలక సమావేశానికి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ గైర్హాజర్ కావడం చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న INDIA కూటమి పోరును మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు సర్ అవకతవకలపై ఉద్యమించేందుకు బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. సర్ ప్రక్రియను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇంతటి కీలక మీటింగ్‌కు హాజరుకాలేదు. ఇందుకు కారణం ఏమై ఉంటుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో పతాకస్థాయికి చేరుకుంది.
యూపీలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలతో అఖిలేశ్ యాదవ్ కినుక వహించారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఖాన్, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు అఖిలేశ్‌కు తీవ్ర అసంతృప్తిని కలిగించినట్టు సమాచారం.
సీట్ల పంపకాల విషయంలో అభిప్రాయభేదాలు?
సీనియర్ నేత గౌతమ్ పాల్ ఇటీవల మాట్లాడుతూ రాష్ట్రలోని మొత్తం 403 సీట్ల కోసం కాంగ్రెస్ సిద్ధం అవుతోందని అన్నారు. కనీసం 150 సీట్లలో తాము తప్పనిసరిగా పోటీ చేస్తామని అన్నారు. సమాన సీట్లు, సమాన హక్కులు, సమాన గౌరవాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని చెప్పుకొచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు కూడా మొదలవుతాయని అన్నారు. మరో నేత మసూద్ మాత్రం నేరుగా అఖిలేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి కోసం అఖిలేశ్ సీట్ల పంపకాల విషయంలో పెద్దమనసుతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే రాష్ట్రంలో INDIA కూటమికి అఖిలేశ్ నాయకత్వం సులువవుతుందని చెప్పుకొచ్చారు. కానీ తాము కాంగ్రెస్‌కు 80-90 సీట్లు మాత్రమే కేటాయించగలమని ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కోణంలోనే అఖిలేశ్ గైర్హాజరీని విశ్లేషించాన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక INDIA కూటమికి మీటింగ్ హాజరుకాని ఎస్పీ చీఫ్ తన తరఫున పార్టీలో కీలకనేతలైన రామ్ గోపాల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, డింపుల్ యాదవ్ వంటివారిని కూడా పంపించకపోవడం ఆసక్తికరంగా మారింది. పార్టీ తరఫున ఈ మీటింగ్‌కు మొహీబుల్లా నద్వీ, హరేంద్ర మాలిక్ మాత్రమే హాజరయ్యారు. తన మనసులోని అసంతృప్తిని తెలియజేసేందుకే అఖిలేశ్ ఇలా చేసుంటారని న్యూఢిల్లీ రాజకీయవర్గాల్లో టాక్. అయితే, త్వరలో జరగనున్న రాజ్యసభ ఎంపీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు సంబంధించిన వ్యవహారాల్లో అఖిలేశ్ బిజీగా ఉన్నారని ఎస్పీ స్పష్టం చేసింది. అంతకుమించిన కారణం ఏమీ లేదని కూడా పేర్కొంది. కాంగ్రెస్ కూడా ఈ వాదనలను తోసిపుచ్చింది. తాను అఖిలేశ్ యాదవ్‌తో స్వయంగా మాట్లాడానని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో ఆయన రాలేకపోయారని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి
ముంబైలో అనుకూలించని వాతావరణం.. 12 విమానాల దారి మళ్లింపు
కర్ణాటకలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 3.5 గా నమోదు