కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురి సజీవ దహనం..
ABN , Publish Date - May 28 , 2026 | 12:56 PM
రాజస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రాజస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అజ్మీర్ జిల్లాలోని శ్రీ రామ్‌పుర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరీ తల్లి పుశీ దేవి అనారోగ్యానికి గురైంది. పుశీ దేవి ఛాతిలో నొప్పితో బాధపడుతుండటంతో రామ్‌సింగ్ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. భార్య సూర్యాజన్ దేవి, మేనకోడలు మహిమాతో కారులో ఆస్పత్రికి బయలుదేరాడు.
ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కారు ఇంటినుంచి బయలుదేరింది. అయితే, శ్రీ రామ్‌పుర దగ్గర ఊహించని దారుణం చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా క్షణాల్లో కారు మొత్తాన్ని మంటలు చుట్టుముట్టాయి. కారు డోర్లు తెరుచుకోకపోవటంతో రామ్‌సింగ్, సూర్యాజన్ దేవి, మహిమా లోపల చిక్కుకుపోయారు. మంటల్లో కాలి బూడిద అయ్యారు. అయితే, పుశీ దేవి మాత్రం కారు నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. అప్పటికే ఆమె శరీరం 60 శాతం కాలిపోయింది.
తీవ్రమైన కాలిన గాయాల కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. కారు మంటల్లో కాలిపోవటం గుర్తించిన స్థానికులు హుటాహుటిన కారు దగ్గరకు చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రమాదం జరగడానికి కారణం ఏంటో అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మహాలక్ష్మికి స్మార్ట్ కార్డులు..
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరంపై ఇరాన్ దాడులు..