విమాన ప్రమాదం.. కీలక వ్యాఖ్యలు చేసిన వీఎస్ఆర్ ఏవియేషన్స్ యజమాని
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:15 PM
లియర్‌జెట్ 45XR విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని వీకే సింగ్ స్పందించారు. తన విమానం మంచి కండీషన్‌లో ఉందని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 28: లియర్‌జెట్ 45XR విమాన ప్రమాదంపై వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని వీకే సింగ్ స్పందించారు. విమాన ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తన విమానం మంచి కండీషన్‌లో ఉందని, ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని ఆయన అన్నారు. వీఎస్‌ఆర్ కంపెనీ మొత్తం ఏడు లియర్‌జెట్ విమానాలను ఆపరేట్ చేస్తోంది. ఓ విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో మిగిలిన ఆరు లియర్‌జెట్ విమానాలను నిలిపివేస్తారా? అని మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.
దానికి వీకే సింగ్ సమాధానం ఇస్తూ.. ‘కచ్చితంగా లేదు. అవన్నీ చాలా మంచి కండీషన్‌లో ఉన్నాయి. అలాంటి వాటిని ఎందుకు నిలిపివేస్తాను. నేనలా చేయను. లియర్‌జెట్ విమానాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అలాంటి వాటిని నేను కచ్చితంగా నిలిపివేయను’ అని స్పష్టం చేశారు. కాగా, విమానాలను అద్దెకు ఇచ్చే అతి పెద్ద సంస్థలలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి. అన్ని రకాల అవసరాల కోసం వీఎస్ఆర్ కంపెనీ విమానాలను అద్దెకు ఇస్తూ ఉంటుంది.
మేడే కాల్ రాలేదు: డీజీసీఏ
విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక విషయాలను వెల్లడించింది. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదని, రన్‌వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారని తెలిపింది. తొలి ప్రయత్నంలో రన్‌వే కనిపించకపోవడంతో.. కాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టిందని వెల్లడించింది. పైలట్లు రెండోసారి విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని, కొద్దిసేపటి తర్వాత రన్‌వే-11 ప్రవేశద్వారం దగ్గర మంటలు కనిపించాయని వివరించింది. రన్‌వే ఎడమ వైపున ప్రవేశద్వారం దగ్గర విమాన శిథిలాలు కనిపించాయని డీజీసీఏ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ
రిస్ట్ వాచ్ ఆధారంగా అజిత్ మృతదేహం గుర్తింపు