ప్రపంచ వేదికపై బయటపడ్డ కోల్డ్ వార్.. ప్రధాని మోదీ పక్కన ఉండగానే..
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:22 PM
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఏఐ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్గజ ఏఐ కంపెనీలకు చెందిన లీడర్లు.. ఆయనతో కలిసి స్టేజిపై ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీల మధ్య కోల్డ్ వార్ బయటపడింది..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’కు మంచి స్పందన వస్తోంది. 16వ తేదీన ప్రారంభమైన ఈ సమిట్.. 21వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఏఐ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగ్గజ ఏఐ కంపెనీలకు చెందిన లీడర్లు ఆయనతో కలిసి స్టేజిపై ఫొటోలు దిగారు. ఈ నేపథ్యంలోనే ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీల మధ్య కోల్డ్ వార్ బయటపడింది.
స్టేజ్‌పై ఉన్న వారంతా ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని ఫొటోకు ఫోజిచ్చారు. అయితే పక్క పక్కనే ఉన్న సామ్, డారియోలు మాత్రం చేతులు కలపలేదు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కనే సామ్ ఆల్ట్‌మాన్ ఉన్నారు. సామ్ పక్కనే డారియో ఉన్నారు. సామ్ తన కుడి వైపు ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చేయి పట్టుకున్నారు. ఎడమ వైపు ఉన్న డారియో చెయ్యి పట్టుకోవటానికి మాత్రం ఆలోచించారు.
అటు, ఇటు చూశారు. కానీ డారియో చెయ్యి పట్టుకోలేదు. డారియో కూడా సామ్ చెయ్యి పట్టుకోవటానికి ఆసక్తి చూపలేదు. ఇద్దరి మధ్య చాలా ఏళ్ల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. డారియో 2021 సంవత్సరానికి ముందు ఓపెన్ ఏఐలో పని చేశారు. సామ్‌తో గొడవల కారణంగా తన సోదరి డానియెలాతో కలిసి బయటకు వచ్చేశారు. 2021లో ఈ ఇద్దరు తోబుట్టువులు కలిసి ఆంథ్రోపిక్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా డారియో, సామ్‌ల మధ్య దూరం మాత్రం తగ్గలేదు. ఇప్పుడిలా ప్రపంచ వేదికపై మరోసారి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రపంచానికి తెలిసిపోయింది.
ఇవి కూడా చదవండి..
ఎముకలు విరగకపోతే నేరం కాదు.. మహిళలకు వ్యతిరేకంగా తాలిబన్ల అమానవీయ చట్టం.
టీ20 ప్రపంచ కప్2026: వరుస వికెట్లతో వరుణ్ చక్రవర్తి రికార్డ్