Share News

బీజేపీలో చేరకపోతే.. అంతు చూస్తామన్నారు

ABN , Publish Date - Jul 31 , 2026 | 04:44 AM

బీజేపీలో చేరకపోతే అంతుచూస్తామంటూ తనను బెదిరించారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని...

బీజేపీలో చేరకపోతే.. అంతు చూస్తామన్నారు

  • ఉద్యమం సమయంలో నిత్యం వేధించారు

  • సీజేపీ నేత దీప్కే సంచలన ఆరోపణలు

  • ప్రధాని పదవిని మరొకరికి ఇచ్చి సోషల్‌ మీడియా

  • ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలి.. మోదీకి సూచన

  • అమిత్‌షా ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు

  • ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌

  • విద్యార్థులపై వేధింపులను నిలిపివేయాలి

  • లేదంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం.. దీప్కే హెచ్చరిక

న్యూఢిల్లీ, జూలై 30: బీజేపీలో చేరకపోతే అంతుచూస్తామంటూ తనను బెదిరించారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘సీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించిన సమయంలో.. బీజేపీలో చేరాలంటూ నాపై నిరంతరం ఒత్తిళ్లు వచ్చాయి. లేదంటే నాతోపాటు, నా కుటుంబం అంతు చూస్తామని బెదిరించారు’’అని దీప్కే బయటపెట్టారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారు తనలాంటి ఓ విద్యార్థిని అలా బెదిరించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపైనా విమర్శలు కురిపించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తుండడాన్ని ఏద్దేవా చేశారు. ‘‘ప్రధాని మోదీ సోషల్‌ మీడియా ప్రభావశీలిగా (ఇన్‌ఫ్లూయెన్సర్‌) బాగా రాణిస్తున్నారు. ఆయన ప్రధాని కుర్చీని ఖాళీ చేసి, పూర్తిస్థాయి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోవాలి. దేశాన్ని పాలించే అధికారం మరో నాయకుడికి అప్పగించాలి’’అని దీప్కే సూచించారు. ఇక, ఆందోళనను విరమించిన తర్వాత కూడా విద్యార్థులకు వేధింపులు కొనసాగుతున్నాయంటూ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని.. ఈ చర్యలను ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ‘‘విద్యార్థులు ఉగ్రవాదులు కారు. వారు మన దేశ భవిష్యత్‌. దేశ భవిష్యత్‌ ఇబ్బందుల్లో పడితే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వాన్నే మార్చేస్తాం. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం’’అని అన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌, పెల్లెట్‌ గన్లను వాడడం వెనుక అమిత్‌షా ప్రమేయం ఉందని దీప్కే ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కిందే పనిచేస్తారని, విద్యార్థులపై దాడులకు ఆదేశాలిచ్చిన అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్రవాదులపై ఉపయోగించే ఆయుధాలు, ఏకే47లను విద్యార్థులపై ప్రయోగించారని, ఈ దాడిలో పలువురు విద్యార్థులు కంటిచూపు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా మంత్రి పదవిని ప్రహ్లాద్‌ జోషికి అప్పగించడంపైనా స్పందించారు. రేపిస్టులను ఆహ్వానించే వ్యక్తిని విద్యామంత్రిగా నియమిస్తున్నారంటూ.. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ రేపిస్టులు, నేరగాళ్లకు మద్దతుగా నిలుస్తోందని తీవ్రమైన విమర్శ చేశారు. బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమెను తానొక సీరియన్‌ రాజకీయ నేతగా చూడడం లేదన్నారు. ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ సవరణ బిల్లు, 2026’ పేపర్‌లీక్‌కు కారకులైన నిందితులను శిక్షించడానికే పరిమితమైంది తప్పించి, అసలు పేపర్‌లీక్‌ను నివారించడంపై దృష్టి పెట్టలేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్‌ రంకా విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, మళ్లీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


ఆరోజు పార్లమెంటును తాకిన ‘చలో’

చలో సంసద్‌ సందర్భంగా పార్లమెంటు భవనానికి 100 మీటర్ల వరకు ఆందోళనకారులు చొచ్చుకెళ్లినట్టు తెలిపే వీడియోలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. పార్లమెంటు పరిసరాల్లోని ఐదు సీసీ టీవీల్లోని దృశ్యాల ఆధారంగా ఓ జాతీయ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. ఈ నెల 20న సీజేపీ నిర్వహించిన చలో పార్లమెంటు ప్రదర్శన హింసాత్మకంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంటు పరిసరాల్లో అత్యంత ఆందోళనకర ఘటనలు చోటుచేసుకున్నాయని, పోలీసులతో ఆందోళనకారులు పదేపదే బాహాబాహీకి దిగారని ఆ పత్రిక తెలిపింది. పోలీసులతో ఘర్షణ పడుతూ, పార్లమెంటు భవనం సమీపం దాకా ఆందోళనకారులు వెళ్లారని, దాని చుట్టుపక్కల ఉన్న కీలక ప్రదేశాల్లోకి చొచ్చుకువెళ్లారని పేర్కొంది. పార్లమెంటుకు అతి సమీపంలోని రైల్వే భవన్‌ వద్ద సెల్ఫీ పాయింట్‌ ఉంది. ఆర్‌ఏఎఫ్‌ దళాలు అక్కడ మోహరించినప్పటికీ, ఆ పాయింట్‌ దాకా ఆందోళనకారులు వెళ్లగలిగారని తెలిపింది. పార్లమెంటు భవనం పరిససరాల్లో భద్రతావ్యవస్థ ఆరోజు అత్యంత బలహీన స్థితిలో ఉన్నదని ఆ జాతీయ పత్రిక తేల్చింది.

వారిపై చర్యలు తీసుకోం!

  • ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన

సీజేపీ నిరసనల్లో పాల్గొన్న వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో క్రిమినల్‌ కేసులు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక నోటీసు విడుదల చేసింది. కాగా, సీజేపీ చలో సంసద్‌ సందర్భంగా 13ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, నిరసనల్లో పాల్గొన్న వారిలో 2,800 మందికి నేరచరిత్ర ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనపై సీజేపీ ప్రతినిధి సౌరవ్‌దాస్‌ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ల మీద దర్యాప్తు చేపట్టబోమని పేర్కొన్నారే తప్ప వాటిని ఉపసంహరించుకుంటామని ఎందుకు స్పష్టం చేయలేదన్నారు. కేసులు ఎత్తివేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మరోసారి వీధుల్లోకి వస్తామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 04:44 AM