జంతర్ మంతర్ నిరసనకు ముందే పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే..
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:21 AM
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనకు ముందే ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసనకు ముందే ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన విమానంలో ఉండగానే ఢిల్లీ పోలీసుల బృందం లోపలికి ప్రవేశించి అదుపులోకి తీసుకుంది.
ఈ ఘటనను దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ప్రసారం చేశారు. ఆయనతో పాటు సీజేపీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విమానం నుంచి ప్రయాణికులు దిగే వరకు వేచి చూడకుండా తమను అదుపులోకి తీసుకోవడంపై సీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు నాయకత్వం వహించేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు.. సీజేపీ నిరసనను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ సెల్ హెడ్ రత్న సింగ్‌లను కూడా నిరసనలో పాల్గొనకుండా నిరోధించేందుకు వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రాత్రికి రాత్రే రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి 400 మందికి పైగా అనుమానిత నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..
భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం