బీజేపీలోకి ఆప్ ఎంపీలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:38 AM
ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. దీంతో...
పార్టీకి ఏడుగురు రాజ్యసభ సభ్యుల రాజీనామా
మూడింట రెండొంతుల మెజారిటీతో బీజేపీలో
విలీనమైనట్లు ప్రకటన.. నితిన్ నబీన్‌తో భేటీ
ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ నుంచి ఎన్నికైనవారే..
నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి పార్టీ దూరం జరిగింది
వారి నేరాల్లో భాగం పంచుకోలేకే బయటకు: చద్దా
పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసింది: కేజ్రీవాల్
ఆ ఎంపీలు ద్రోహులు.. ఆప్ వెంటే పంజాబ్: భగవంత్
వేటు వేయాలని చైర్మన్‌ను కోరతాం: సంజయ్‌సింగ్
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో లుకలుకలు!
చద్దాతో పలువురు ఆప్ ఎమ్మెల్యేల సంప్రదింపులు?
వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభలో ఆప్‌నకు ఉన్న 10 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు పార్టీని వీడినట్లయ్యింది. మూడింట రెండు వంతుల మంది పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదు కాబట్టి.. పార్టీని వీడిన వారిపై వేటు పడే అవకాశాలు కూడా లేనట్టే. మరోవైపు, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా లుకలుకలు మొదలయ్యాయన్న వార్తలు వెలువడ్డాయి. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఆరుగురు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే కావటంతో.. వారితో పంజాబ్‌లో ఆప్‌నకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. ఈ పరిణామాలు ఆప్‌ను తీవ్ర సంకటంలోకి నెట్టివేశాయి. ఇదంతా శుక్రవారం రాఘవ్‌చద్దా తదితర ఆప్ ఎంపీల ఆకస్మిక మీడియా సమావేశంతో ప్రారంభమైంది. ఇటీవలే ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగింపునకు గురైన రాఘవ్‌చద్దా.. తన స్థానంలో ఆ పదవి చేపట్టిన మరో ఎంపీ అశోక్ మిత్తల్‌తో కలిసి ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారితో మరో ఎంపీ సందీప్ పాఠక్ కూడా ఉన్నారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ, తమతోపాటు మరో నలుగురు ఆప్ ఎంపీలు స్వాతి మలివాల్, క్రికెటర్ హర్భజన్‌సింగ్, విక్రమ్ సహానీ, రాజిందర్ గుప్తా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. తమ బృందం బీజేపీలో విలీనమవుతున్నట్లు తమ సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్‌కు సమర్పించామన్నారు.
రాజ్యాంగం ప్రకారం మూడింట రెండొంతుల మంది సభ్యులు ఉంటే వేరే పార్టీతో విలీనం కావచ్చని గుర్తు చేశారు. ‘నా యవ్వన కాలంలో 15 ఏళ్లు ఆప్‌కు ధారపోశాను. నా రక్తం, స్వేదంతో పార్టీని నిర్మించాను. కానీ, ప్రస్తుతం ఆ పార్టీ.. నిర్దేశించుకున్న సిద్ధాంతాలు, విలువల నుంచి పూర్తిగా దూరం జరిగింది. వారి నేరాల్లో నేను పాలుపంచుకోవటం లేదు కాబట్టి నన్ను పక్కనపెట్టారు. అందువల్లే బయటకు రావాలని నిర్ణయించుకున్నా. ఇకపై ప్రజలకు మరింత దగ్గరగా ఉండి పని చేస్తా’ అని రాఘవ్ చద్దా వెల్లడించారు. అనంతరం ఈ ముగ్గురు ఎంపీలూ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కలుసుకున్నారు. అనంతరం, నితిన్ నబీన్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘బీజేపీ కుటుంబంలోకి రాఘవ్ చద్దా, సందీ్‌పపాఠక్, అశోక్‌మిట్టల్‌కు స్వాగతం పలికాను. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో పని చేసేందుకు హర్భజన్‌సింగ్, స్వాతిమలివాల్, రాజిందర్‌గుప్తా, విక్రమ్‌సహానీలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు.
పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం
ఆప్‌ను వీడిన ఏడుగురిలో స్వాతి మలివాల్ ఢిల్లీకి ప్రాతినిఽధ్యం మహిస్తుండగా, మిగతా ఆరుగురు పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ పరిణామంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్స్‌లో స్పందిస్తూ.. పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందని విమర్శించారు. ఆప్ కీలక నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మన్.. పార్టీని వీడిన ఎంపీలు ద్రోహులని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర పన్ని ఆప్‌ను బలహీనం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని, కానీ, అటువంటి అవకాశం ఏదీ దొరక్కపోవటంతో.. ఈ విధంగా పార్టీని దెబ్బతీద్దామనుకున్నారని చెప్పారు. అయినప్పటికీ, పార్టీకి నష్టం జరగదని, పార్టీని వీడిన ఆరేడుగురు వ్యక్తులే పంజాబ్ కాదని, రాష్ట్రం యావత్తూ ఆప్ వెంటే ఉందన్నారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ ద్వారా తమ పార్టీలో వెన్నుపోట్లను ప్రోత్సహించి, చవకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు. బీజేపీలో చేరినట్లు ప్రకటించిన రాఘవ్‌చద్దా, అశోక్‌మిట్టల్, సందీ్‌పపాఠక్‌లపై అనర్హత వేటు వేయాలని రాజ్యసభ ఛైర్మన్‌కు విజ్ఞాపనపత్రం సమర్పిస్తామని వెల్లడించారు. ఆప్‌లో తిరుగుబాటుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందిస్తూ.. తమది విభిన్నమైన పార్టీ అని చెప్పుకున్న ఆప్ ప్రస్తుతం అవినీతికి చిరునామాగా మారిందని ఆరోపించారు. మరోవైపు, ఆప్‌లో జరిగిన ఈ పరిణామాలపై సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందిస్తూ.. పార్టీ సరైన దారిలో వెళ్లి ఉంటే ఇలాంటిది జరిగి ఉండేది కాదని, ఇది పార్టీ నాయకత్వం వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. పార్టీని వీడినవారు ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారని, అందుకే ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చన్నారు.

ఈడీ దాడులు.. ఆ వెంటనే ఫిరాయింపు!
రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్న రాఘవ్‌చద్దా.. పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించటం లేదని, కేంద్రప్రభుత్వం మీద, ముఖ్యంగా, ప్రధాని మోదీ మీద అవసరమైన సందర్భాల్లో కూడా విమర్శలు చేయటానికి వెనుకంజ వేస్తున్నారని ఆప్ నేతలు ఇటీవల విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, ఆయనను డిప్యూటీ నేత పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో లవ్లీ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఎంపీ అశోక్ మిత్తల్‌ను నియమించారు. ఆ పదవిలో నియామకమైన వెంటనే అశోక్ మిత్తల్ నివాసంపై ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రాఘవ్ చద్దాతోపాటు అశోక్‌మిత్తల్ కూడా ఆప్‌ను వీడటం గమనార్హం. దీనిపై ఆప్ వర్గాలు స్పందిస్తూ.. పార్టీని వీడిన ఏడుగురు ఎంపీల్లో పలువురు వ్యాపారవేత్తలని.. కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐలతో భయపెట్టటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. మిగిలినవారు ఇటీవలి కాలంలో పార్టీలో ప్రాముఖ్యత దక్కటం లేదన్న అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి కీలక బాధ్యతలు లభించలేదన్న కారణంగా ఆప్‌ను వీడారని ఆ వర్గాలు విశ్లేషించాయి. కాగా, కొత్తగా చేరే ఏడుగురు ఎంపీలతో రాజ్యసభలో బీజేపీ బలం ఇప్పుడున్న 106 నుంచి 113కి పెరగనుంది. ఎన్‌డీఏ కూటమి పరంగా ఇది 141 నుంచి 148కి చేరుతుంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. మెజారిటీకి 123 మంది మద్దతు అవసరం.
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వంపై నీలినీడలు?
ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పార్టీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలు రాఘవ్‌చద్దాతో సంప్రదింపులు జరుపుతున్నారని రిపబ్లిక్ టీవీ ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ పరిణామాలపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్‌సింగ్ మాట్లాడుతూ, రాజ్యసభ టికెట్లను ఆప్ అధిష్ఠానం పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు ఇచ్చిందని, వారికి వ్యాపార ప్రయోజనాలు తప్ప పార్టీ సిద్ధాంతాలతో ప్రమేయం లేదన్నారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఇదే జరిగిందని, కాబట్టి, రానున్న రోజుల్లో పలువురు ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని చెప్పారు. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్‌సింగ్ మజితియా ఇవే వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారన్నారు. ఏకంగా సీఎం భగవంత్‌మన్ చేరినా చేరవచ్చని వ్యాఖ్యానించారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో ఆప్‌నకు 94 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News