దశ-దిశ లేని ఆ యువత పనీపాట లేకుండా 8.7 కోట్ల మంది!
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:58 AM
దేశవ్యాప్తంగా 15-29 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో 8.7కోట్ల మంది చదువుకోవడం గానీ, ఉద్యోగం చేయడం గానీ, లేకపోతే ఏదైనా శిక్షణ తీసుకోవడం గానీ.. ఏదీ చేయట్లేదని నీతి ఆయోగ్ తాజా నివేదికలో...
చదువు, ఉద్యోగం లేదు.. ఏ శిక్షణ పొందట్లేదు
దేశంలో పరిస్థితులపై నీతి ఆయోగ్ తాజా నివేదిక
ఈ యువతను ‘నీట్’గా అభివర్ణించిన నీతి ఆయోగ్
నీట్ అంటే నో-ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్
న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశవ్యాప్తంగా 15-29 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో 8.7కోట్ల మంది చదువుకోవడం గానీ, ఉద్యోగం చేయడం గానీ, లేకపోతే ఏదైనా శిక్షణ తీసుకోవడం గానీ.. ఏదీ చేయట్లేదని నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మూడు విభాగాల పిల్లలను నీతి ఆయోగ్ తన నివేదికలో ‘నీట్’(నో- ఎడ్యుకేషన్, ఎంప్లాయీమెంట్, ట్రైనింగ్)గా అభివర్ణించడం గమనార్హం. ఈ నీట్ యువత అందరికీ వెంటనే సబ్సిడీ కింద ఉద్యోగ శిక్షణ అందించాల్సి ఉందని నీతి ఆయోగ్ నొక్కి చెప్పింది. వారంతా ఏదో ఒక ఉపాధి పొందేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించింది. 2021లో నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే 78వ రౌండ్ డేటా ఆధారంగా నీతి ఆయోగ్ ఈ నివేదికను విడుదల చేసింది. నివేదికలో పేర్కొన్న నీట్ యువత ఉపాధి పొందలేకపోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని విశ్లేషించింది. పేద కుటుంబాలు ఇప్పటికే బడులు, కాలేజీల్లో ఫీజులు కట్టి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయని, అందుకే వారు తమ పిల్లలను కోచింగ్‌లకు, ట్రైనింగ్‌లకు పంపలేకపోతున్నారని వివరించింది. వారికి రాయితీ కింద ట్రైనింగ్ అందించాలని కేంద్రానికి సూచించింది. కాగా, నీట్-యూజీ పేపర్ లీకేజీపై ఇటీవల దేశవ్యాప్త ఉద్యమం, ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఖాళీగా ఉన్న యువతను నీతి ఆయోగ్ సంక్షిప్తంగా ‘నీట్’గా అభివర్ణించడం విశేషం.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్