Share News

థాయ్‌లాండ్‌లో భారతీయుల కిడ్నాప్ గ్యాంగ్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్..

ABN , Publish Date - Jul 30 , 2026 | 07:52 AM

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి వారి కుటుంబాల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్ నుంచి దేశం విడిచి పారిపోవడానికి యత్నిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

థాయ్‌లాండ్‌లో భారతీయుల కిడ్నాప్ గ్యాంగ్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్..

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసి వారి కుటుంబాల నుంచి భారీగా నగదు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు భారతీయులను థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్‌లోని ఖ్లోంగ్ టాన్ ప్రాంతంలోని ఓ హోటల్ నుంచి దేశం విడిచి పారిపోవడానికి యత్నిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో థాయ్‌లాండ్ టూర్‌కు తీసుకెళ్తామని నమ్మించిన కేటుగాళ్లు.. ముగ్గురు యువకులను ఆ దేశానికి రప్పించారు. అనంతరం బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులు వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బడ్జెట్ టూర్ పేరుతో మోహిత్ (23), ఆశిష్ (24), హిమాన్షు (20) అనే ముగ్గురు భారతీయ యువకులను ఐదుగురు నిందితులు పట్టాయాకు రప్పించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారిని ఓ ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు బంధించి తీవ్రంగా హింసించారు. డబ్బు వసూలు చేసేందుకు యువకుల కాళ్లు, చేతులు కట్టేసి కొడుతూ బాధితుల కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా చూపించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో జులై 21న చోన్‌బురి ఇమిగ్రేషన్, పట్టాయా సిటీ పోలీసులకు థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సమాచారం అందించింది. వీడియో కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సోమవారం పట్టాయాలోని రెండు అంతస్తుల టౌన్‌హౌస్‌పై దాడి చేసి ముగ్గురిని సురక్షితంగా రక్షించారు.


అరెస్టయిన నిందితులను అవతార్ సింగ్ (38), జగ్జీత్ సింగ్ (38), రాంబాలక్ కుమార్ (24), సుఖ్‌బీర్ సింగ్ (37), కుల్రా సింగ్ (27)గా పోలీసులు గుర్తించారు. నెల రోజుల క్రితం చాట్ యాప్ ద్వారా వారికి పరిచయమైన ఓ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఆదేశాల మేరకే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న సూత్రధారి బాధితుల కుటుంబాల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవంతంగా కిడ్నాప్ పూర్తి చేస్తే బాధితుల వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులతో పాటు థాయ్‌లాండ్ నుంచి పారిపోయేందుకు విమాన టికెట్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు విచారణలో తేలింది.


నిందితుల అరెస్టు తర్వాత బాధితులు కీలక విషయాలు వెల్లడించారు. తమకంటే ముందు మరో భారతీయుడిని కూడా ఇదే ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. అతని కుటుంబం సుమారు రూ.30 లక్షలు చెల్లించిన తర్వాతే విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన థాయ్ పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. దుబాయ్‌లో ఉన్నట్లు భావిస్తున్న ప్రధాన సూత్రధారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇరాన్‌కు చైనా ఆయుధాలు ఇస్తే తీవ్ర నిరాశ చెందుతా: ట్రంప్

ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

Updated Date - Jul 30 , 2026 | 07:57 AM