వైద్యుల నిర్లక్ష్యం.. ఒక కాలికి బదులు మరో కాలికి సర్జరీ..
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:52 PM
హరియాణాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఒక కాలికి బదులు మరో కాలికి సర్జరీ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హరియాణాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఒక కాలికి బదులు మరో కాలికి సర్జరీ చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నూహ్ జిల్లాకు చెందిన నాలుగేళ్ల బాలుడి ఎడమ కాలికి కణితి అయ్యింది. బాలుడి తండ్రి ఆరిఫ్ అతడిని నల్హార్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌కు తీసుకెళ్లాడు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఆల్ట్సాసౌండ్ పరీక్ష చేసి ఎడమ కాలికి సర్జరీ చేయాలని చెప్పారు.
దీంతో ఆరిఫ్ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాడు. డాక్టర్లు కాలికి సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత బాలుడిని వీల్ ఛైర్‌లో బయటకు తీసుకువచ్చారు. బాలుడి ఎడమ కాలికి బదులు కుడి కాలికి సర్జరీ చేసి ఉండటం చూసి ఆరిఫ్ షాక్ అయ్యాడు. ఎడమ కాలికి బదులు కుడి కాలికి సర్జరీ చేశారేంటని అక్కడి డాక్టర్లను ప్రశ్నించాడు. తప్పు జరిగిపోయిందని, వెంటనే ఎడమ కాలికి సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత సరైన కాలికి సర్జరీ జరిగింది. ఈ ఘటనపై ఆరిఫ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజ్ యాజమాన్యం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. నలుగురు డాక్టర్లతో కమిటీ వేసింది.
కాలేజ్ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ విషయమై రాతపూర్వక ఫిర్యాదు అందింది. విచారణ జరిపేందుకు నలుగురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే?
కార్గిల్ హీరో గదిని గుడిగా మార్చిన తల్లి.. 27 ఏళ్లుగా కొడుకు జ్ఞాపకాలతో..