3,383 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే భిక్షాటన!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:23 AM
కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా గుర్తుందా? కోట్ల ఆస్తులున్న ఒక బిజినెస్‌మ్యాన్, తన తల్లి ప్రాణాలను...
జైన గురువు సూచనతో ముంబై వీధుల్లో ఒకరోజు భిక్షాటన చేసిన పరాగ్ షా
జీవిత సత్యం తెలుసుకోవడానికే అన్న బీజేపీ ఎమ్మెల్యే
ముంబై, సెప్టెంబరు 15: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా గుర్తుందా? కోట్ల ఆస్తులున్న ఒక బిజినెస్‌మ్యాన్, తన తల్లి ప్రాణాలను కాపాడుకోవడం కోసం రహస్యంగా బిచ్చగాడిలా మారతాడు. సరిగ్గా అలాంటి సీనే ఇప్పుడు ముంబై వీధుల్లో రిపీట్ అయింది. కాకపోతే ఇక్కడ భిక్షాటన చేసింది రీల్ హీరో కాదు.. ఏకంగా రూ.3,383 కోట్ల ఆస్తులున్న ఒక రియల్ పొలిటిషియన్! మహారాష్ట్రకు చెందిన అత్యంత ధనిక ఎమ్మెల్లేలలో ఒకరైన పరాగ్ షా.. సెక్యూరిటీ, కాన్వాయ్, లగ్జరీ కార్లు, కోట్ల వైభోగాన్ని వదిలేసి ముంబై వీధుల్లో బిచ్చగాడి వేషంలో భిక్షాటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ‘బిచ్చగాడు’ సినిమాలో అమ్మ కోసం హీరో భిక్షగాడిగా మారితే.. ఘాట్‌కోర్ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా మాత్రం తనలోని అహంకారాన్ని వీడటం కోసం, జీవిత సత్యాన్ని గ్రహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జైన మతానికి చెందిన చాతుర్మాస ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా, తన ఆధ్యాత్మిక గురువు నమ్రముని సలహా మేరకు ఆయన ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు పరాగ్ షా ప్రత్యేకంగా మేకప్ వేసుకుని, చిరిగిన దుస్తులు ధరించి ఘాట్‌కోర్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశారు. ఒక వ్యక్తి సానుభూతితో రూ.20 ఇచ్చి, భోజనం చేయమన్నాడని, అలాగే, ఒక సమోసా బండి వ్యాపారి ఉచితంగా సమోసా ఇచ్చాడని పరాగ్ షా పేర్కొన్నారు. ముంబై ప్రజలు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని ఈ సంఘటన నిరూపించిందన్నారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుతోనే ఎమ్మెల్యే ఆరోజు ఆహారం తిన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News