Share News

200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ.. రథంలో ఘనంగా ఇంటికి తీసుకొచ్చిన కుటుంబం

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:00 PM

మహారాష్ట్రలోని ఓ కుటుంబానికి ఎట్టకేలకు రెండు శతాబ్దాల కల నెరవేరింది. నాలుగు తరాల తర్వాత పుట్టిన కూతురిని కుటుంబ సభ్యులు మహాలక్ష్మిగా భావించి, ఆసుపత్రి నుంచి రథంలో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి, ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు..

200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ.. రథంలో ఘనంగా ఇంటికి తీసుకొచ్చిన కుటుంబం
Baby Girl Born after 200 Years

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఓ కుటుంబానికి సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. నాలుగు తరాల తర్వాత తమ కుటుంబంలోకి ఆడపిల్ల అడుగుపెట్టడంతో దహిఫాలే కుటుంబ సభ్యులు చిన్నారికి ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గార్గి అనే నవజాత శిశువును ఆమె తల్లితో కలిసి ప్రత్యేకంగా అలంకరించిన భారీ రథంలో ఇంటికి తీసుకువచ్చారు. డప్పులు, తాళాల మోత, పాటలు, నృత్యాలతో సాగిన ఈ రథయాత్ర స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందోత్సాహాలతో చిన్నారిని స్వాగతించారు. గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లోటు తీరిందని ఆమె తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగానికి గురయ్యారు.

baby girl.jpg


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గార్గి పుట్టుకతో కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆడపిల్ల లేని లోటు తీరింది. మా కుటుంబంలోకి కుమార్తె రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇన్నేళ్లుగా ఆడపిల్ల లేదనే బాధ ఉండేదని, ఇప్పుడు ఆ లోటు తీరింది. నా ఇద్దరు కోడళ్లను కూడా సొంత కూతుళ్లలా చూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలిని సంగీతం, నృత్యాల మధ్య రథంలో ఇంటికి తీసుకురావడం జీవితంలో మరచిపోలేని రోజు’ అని అన్నారు.

baratj.jpgచిన్నారి గార్గి తండ్రి మాట్లాడుతూ.. ‘చాలామంది కొడుకు కావాలని కోరుకుంటారు. కూతురు పుట్టినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. నా కూతురిని పువ్వులా.. అపురూపంగా పెంచుకుంటా’ అని అన్నారు.

మరోవైపు ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని వేడుకగా నిర్వహించిన దహిఫాలే కుటుంబాన్ని సామాజిక కార్యకర్త అనంత్ ఇంగ్లే అభినందించారు. సమాజంలోని కొన్ని వర్గాల్లో ఇప్పటికీ ఆడపిల్లల జననంపై ప్రతికూల ఆలోచనలు ఉన్నాయని, అలాంటి సమయంలో గార్గి రాకను కుటుంబ సభ్యులు సంబరంగా జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

భూ భారతి రిజిస్ట్రేషన్లకు మోక్షం ఎన్నడు?

Updated Date - Sep 02 , 2026 | 02:04 PM