17 మంది ఖైదీల పరారీ
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:09 AM
తమిళనాడులోని తేని జిల్లా జైలులో అనూహ్య సంఘటన జరిగింది.
ఓ ఖైదీకి మూర్చవచ్చిందంటూ నాటకమాడి, గార్డులపై దాడి చేసి జైలు నుంచి జంప్
తమిళనాడులోని తేని జిల్లా జైలులో ఘటన
13 మందిని మళ్లీ అరెస్టు చేసిన పోలీసులు
చెన్నై, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తేని జిల్లా జైలులో అనూహ్య సంఘటన జరిగింది. విచారణ ఖైదీలుగా ఉన్న 17మంది గార్డులపై దాడి చేసి, వారి వద్ద ఉన్న తాళాలతో గేట్లు తెరుచుకుని జైలు నుంచి పారిపోయారు. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో యావత్ తమిళనాడు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. జైలు చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టి కొన్ని గంటల వ్యవధిలోనే పరారైన వారిలో 13 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలిస్తోంది.
ఇక, ఈ ఘటనకు సంబంధించి తేని జైలు సూపరింటెండెంట్ సహా 9మంది సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తేని సమీపంలోని తేకంపట్టిలో ఉన్న జిల్లా జైలులో 200 మంది ఖైదీలను ఉంచేందుకు అవకాశముంది. అయితే నాలుగు బ్లాకులున్న ఆ జైలులో 334 మంది ఖైదీలను ఉంచారు. 2వ నెంబర్ బ్లాక్ బేరక్‌లో గంజాయి, చోరీ కేసులు, మారణాయుధాలతో దాడి, బెదిరింపులు వంటి నేరాలపై అరెస్టయిన విచారణ ఖైదీలు 17 మందిని ఉంచారు. సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జైలులోని ఓ ఖైదీకి మూర్చ వచ్చిందంటూ ఖైదీలంతా బిగ్గరగా కేకలు పెట్టారు. దీంతో జైలు గార్డు, ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు. వెంటనే అక్కడున్న ఖైదీలంతా ఆ పోలీసులపై దాడి చేశారు. తాళం చెవులను లాక్కొని, వాటి సాయంతో 17మంది ఖైదీలు పరారయ్యారు. సమాచారం అందుకున్న జైళ్ల విభాగం ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతం తదితరులు హూటాహూటిన అక్కడకు చేరుకుని గాయపడ్డ సిబ్బందిని తేని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు 17ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అలాగే, ఎస్పీ కార్యాలయం నుంచి డ్రోన్లను తెప్పించి అన్వేషణ మొదలుపెట్టారు. ఆ జైలు పరిసరాల్లోని పొలాలు, కొండలు, సమీప బస్టాండ్లలో తీవ్రంగా గాలించారు. 13మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు