Share News

11వేల ఇంజెక్షన్‌కు.. 1.30 లక్షలా!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:01 AM

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, ప్రైవేటు ఆస్పత్రులు మందుల విక్రయాలపై భారీగా దోచుకుంటుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

11వేల ఇంజెక్షన్‌కు.. 1.30 లక్షలా!
sc judjes

  • ఇది వ్యాపారమా.. నిలువు దోపిడీయా?

  • ప్రైవేటు ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వంపైసుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 27: ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని, ప్రైవేటు ఆస్పత్రులు మందుల విక్రయాలపై భారీగా దోచుకుంటుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీలర్‌కు రూ.11వేలకు లభించే క్యాన్సర్‌ ఇంజెక్షన్‌ను రోగికి రూ.1.30 లక్షలకు విక్రయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇంతటి దోపిడీని ఎలా సమర్థించుకుంటారని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం నిలదీసింది. మందుల ధరలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై, మంగళవారం మరోసారి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. తన తీర్పును రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా ఒక క్యాన్సర్‌ రోగి ఉదంతాన్ని ప్రస్తావించింది. ‘‘మందుల వ్యాపారం చేసే ఓ వ్యక్తి భార్య ప్రైవేటు ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్స కోసం చేరారు. కీమోధెరపీలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్‌ డీలర్‌ ధరపై తనకు రూ.11వేలకే లభిస్తుందని.. తాను బయటి నుంచి తెస్తానని ఆ వ్యాపారి చెప్పారు. అందుకు ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోకపోగా.. అదే ఇంజెక్షన్‌కు ముక్కుపిండి రూ.1,30,000 వసూలు చేసింది. ఈ దోపిడీని మీరు ఎలా సమర్థించుకుంటారు? రోగులు ప్రాణాలతో ముడిపడిన విషయంలో ఇంటి వ్యాపార ధోరణి పనికిరాదు’’అని వ్యాఖ్యానించింది. అయితే, మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సవరిస్తోందని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యభాటి కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.


రూ.11వేల మందును రోగికి రూ.1.30 లక్షలకు విక్రయించడం ధరల నియంత్రణ ఎలా అవుతుంది? అని ప్రశ్నించింది. క్యాన్సర్‌ మందులపై ట్రేడ్‌ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. మార్కెట్లో 90 శాతం మందులు ఔషధ ధరల నియంత్రణలకు వెలుపలే (డీపీసీవో) ఉన్న విషయాన్ని గుర్తు చేసింది.

ధరలు తగ్గిస్తే ఆస్పత్రుల నిర్వహణ కష్టం..

ప్రభుత్వ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉన్నందున ప్రైవేటు ఆస్పత్రులు కీలక సేవలు అందిస్తున్నాయని.. సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. ఔషధాల ధరలను తగ్గించాలని ఒత్తిడి చేస్తే.. ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుందని, అవి కుప్పకూలే ప్రమాదం ఉంటుందన్నారు. అప్పుడు ఇతర సేవల ధరలను పెంచాల్సి వస్తుందన్నారు. ‘‘రోగులు బయటి నుంచి తెచ్చే మందుల నాణ్యతను ఆస్పత్రులు విశ్వసించలేవు. ఎందుకంటే మార్కెట్లో సగం నకిలీ ముందులే ఉన్నాయి’’అని వివరించారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆస్పత్రులు ప్రతి సేవకూ చార్జీ వసూలు చేస్తున్నప్పుడు.. మందులపై ఇంత అధిక ధరలు ఎందుకని ప్రశ్నించింది.

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 05:07 AM