Share News

లిఫ్ట్‌లో చిక్కుకుపోయారా..? బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

ABN , Publish Date - Oct 27 , 2026 | 09:50 PM

బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో లిఫ్ట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదా సాంకేతిక లోపాల కారణంగా ఒక్కోసారి లిఫ్ట్‌లు మధ్యలోనే ఆగిపోతుంటాయి.

లిఫ్ట్‌లో చిక్కుకుపోయారా..? బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

ఇంటర్నెట్ డెస్క్: బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో లిఫ్ట్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదా సాంకేతిక లోపాల కారణంగా ఒక్కోసారి లిఫ్ట్‌లు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇలాంటి సమయంలో లోపల ఉన్నవారు భయాందోళనలకు గురై, తొందరపాటుతో తప్పులు చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ అపాయం నుంచి ఈజీగా గట్టెక్కొచ్చు.


ముందుగా ప్రశాంతంగా ఉండాలి

లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోతే ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలి. గట్టిగా అరవడం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి చర్యలు వద్దు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధైర్యంగా ఉండాలి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినంత మాత్రాన లిఫ్ట్ కిందకు పడిపోతుందని భావించకూడదు.

అత్యవసర బటన్‌ను నొక్కాలి

లిఫ్ట్‌లో ఉండే ఎమర్జెన్సీ అలారం లేదా కాల్ బటన్‌ను ఉపయోగించి భవనం భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలి. ఇంటర్‌కామ్ సదుపాయం ఉంటే దాని ద్వారా కూడా సహాయం కోరవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే భవనం నిర్వహణ సిబ్బందికి లేదా అత్యవసర సహాయ నంబర్ 112కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాలి.


తలుపులు తెరిచేందుకు ప్రయత్నించొద్దు

లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరవడం ప్రమాదకరం. లిఫ్ట్ రెండు అంతస్తుల మధ్య ఆగినప్పుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు. అందుకే ఈ చర్యలకు దూరంగా ఉండాలి.

సహాయక సిబ్బంది వచ్చే వరకు వేచి ఉండాలి

లిఫ్ట్‌లో గాలి అయిపోతుందనే భయంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీలైనంత ప్రశాంతంగా ఉండి, సాంకేతిక నిపుణులు లేదా శిక్షణ పొందిన సహాయక సిబ్బంది వచ్చేవరకు లోపలే ఉండాలి. సరైన అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవచ్చు.


ఇవీ చదవండి

ఆ తప్పు చేస్తే.. 6 నెలల వరకూ జైలు శిక్షకు

ఇంట్లో ఎలుకల బెడదకు చెక్.. చంపకుండానే తరిమికొట్టండిలా

Updated Date - Oct 27 , 2026 | 09:50 PM