ఆ తప్పు చేస్తే.. 6 నెలల వరకూ జైలు శిక్షకు ఛాన్స్.. రైల్వే హెచ్చరిక
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:27 PM
ఫోన్‌లల్లో పెద్ద శబ్దంతో పాటలు, వీడియోలు ప్లే చేసే రైల్వే ప్రయాణికులకు గరిష్ఠంగా ఆరు నెలల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సదరన్ రైల్వే తాజాగా హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: రైల్లో ప్రయాణికులు తమ ఫోన్లల్లో పాటలను అందరికీ వినిపించేలా స్పీకర్‌లను ఆన్ చేసి ప్లే చేయడం నిత్యం చూస్తూనే ఉంటాము. మరి కొందరు స్పీకర్ ఆన్ చేసి మరీ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడుతుంటారు. ఇలా పక్కవారికి ఇబ్బంది కలిగించే ప్రయాణికులకు సదరన్ రైల్వే తాజాగా హెచ్చరిక చేసింది. ఈ తప్పులకు గరిష్ఠంగా ఆరు నెలల వరకూ జైలు శిక్ష పడవచ్చని పేర్కొంది.
రైల్లో ప్రయాణికులు నిబంధనలు పాటించేలా సదరన్ రైల్వే నడుం కట్టింది. రైల్లో ప్రయాణించేటప్పుడు ఫోన్‌లో స్పీకర్‌లు ఆన్ చేసి పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేయవద్దని పేర్కొంది. ఇలా చేస్తే జరిమానాలు, జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని సదరన్ రైల్వే హెచ్చరించింది. మొదటి సారి తప్పు చేసిన వారికి రూ.1000 వరకూ జరిమానా విధిస్తామని తెలిపింది. పదే పదే ఇదే తప్పు చేసే వారికి గరిష్ఠంగా రూ.5 వేల జరిమానా, ఆరు నెలల కారాగార శిక్ష, లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను సదరన్ రైల్వే ఆదేశించింది. స్టేషన్లతో పాటు రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు ఫోన్లలో బిగ్గరగా పాటలు, మూవీలు ప్లే చేయకూడదని తెలిపింది. ఫోన్‌లో పెద్దగా మాట్లాడవద్దని కూడా స్పష్టం చేసింది. ఫోన్‌లో పాటలు, వీడియోలు చూసేటప్పుడు తప్పనిసరిగా హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్‌ను వాడాలని సూచించింది. తొటి ప్రయాణికులు రైల్లో న్యూసెన్స్ సృష్టిస్తున్నప్పుడు రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కూడా చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
దక్షిణాదిలో తప్పకుండా సందర్శించాల్సిన 5 ఫేమస్ టెంపుల్స్ ఇవే!