Share News

IRCTC కాశీ తీర్థ యాత్ర.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల దర్శనం

ABN , Publish Date - Jun 17 , 2026 | 02:11 PM

ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులకు IRCTC శుభవార్త అందించింది. కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, బోధ్‌గయ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల దర్శనం కోసం ప్రత్యేక తీర్థ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది.

IRCTC కాశీ తీర్థ యాత్ర.. తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాల దర్శనం
IRCTC Kashi Yatra 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి అవకాశం అందిస్తోంది. కాశీ, అయోధ్య సహా ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక తీర్థ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ 9 రోజుల యాత్రలో గయ, బోధ్‌గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ యాత్ర 2026 సెప్టెంబర్ 9న తిరునెల్వేలి నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 17న ముగుస్తుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం మార్గమధ్యంలోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఎక్కేందుకు, దిగేందుకు అవకాశం కల్పించారు.


యాత్ర వివరాలు

యాత్ర మొదటి రోజు రైలు తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి బయలుదేరుతుంది. విరుదునగర్, మదురై, దిండిగల్, తిరుచిరాపల్లి, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మోర్, గూడూరు వంటి స్టేషన్ల నుంచి ప్రయాణికులు రైలు ఎక్కవచ్చు. మూడో రోజు రైలు గయకు చేరుకుంటుంది. అక్కడ ప్రయాణికులకు వసతి ఏర్పాటు చేస్తారు. అనంతరం బోధ్‌గయలోని ప్రసిద్ధ మహాబోధి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత విష్ణుపాద ఆలయ దర్శనం అనంతరం వారణాసికి ప్రయాణం కొనసాగుతుంది.

కాశీలో ప్రముఖ ఆలయాల దర్శనం

వారణాసిలో భక్తులకు కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయం, కాశీ విశాలాక్షి ఆలయం, కాలభైరవ ఆలయాల దర్శనం కల్పిస్తారు. సాయంత్రం జరిగే గంగా హారతి ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. తర్వాత యాత్ర అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ రామ జన్మభూమి సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అనంతరం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.

ప్యాకేజీ ధరలు, సౌకర్యాలు

IRCTC మూడు రకాల ప్యాకేజీలను అందిస్తోంది.

  • స్లీపర్ క్లాస్ (ఎకానమీ): ఒక్కొక్కరికి రూ.16,700

  • థర్డ్ ఏసీ: ఒక్కొక్కరికి రూ.26,100

  • సెకండ్ ఏసీ: ఒక్కొక్కరికి రూ.34,100

  • పిల్లలకు ప్రత్యేక ధరలు వర్తిస్తాయి.


ఈ ప్యాకేజీలో..

  • రైలు ప్రయాణం

  • వసతి సదుపాయం

  • భోజనం

  • స్థానిక రవాణా

  • పుణ్యక్షేత్రాల సందర్శన అన్నీ కలిపి ఉంటాయి.

భారత్ గౌరవ్ రైలు పథకం కింద ఈ ప్యాకేజీపై 33 శాతం వరకు రాయితీ కూడా అందిస్తున్నట్లు IRCTC తెలిపింది. తక్కువ ఖర్చుతో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారనుంది.


Also Read:

ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు

Updated Date - Jun 17 , 2026 | 02:11 PM