ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్ర
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:50 PM
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారా? అయితే, ఐఆర్‌సీటీసీ మీకోసం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు ప్రధాన దేవాలయాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు శుభవార్త. IRCTC ప్రత్యేకంగా 'దివ్య దక్షిణ యాత్ర - అరుణాచలం, చిదంబరం' పేరుతో కొత్త టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రయాణికులు 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ తరగతుల్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రారంభ ధర రూ.14,500గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీ ద్వారా తమిళనాడులోని ప్రముఖ క్షేత్రాలు అయిన తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం (Rameswaram), మధురై (Madurai), కన్యాకుమారి (Kanyakumari), , తిరుచ్చి(Tiruchi), తంజావుర్ (Thanjavur), చిదంబరం ( Chidambaram) ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించారు. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి మే 24న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఈ రైలు ఎక్కే సౌకర్యం ఉంది.

యాత్ర వివరాలు..
మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు, రెండో రోజు ఉదయం అరుణాచలం చేరుతుంది. అక్కడ దర్శనం అనంతరం రామేశ్వరం వైపు ప్రయాణం కొనసాగుతుంది.
మూడో రోజు కుడల్ నగర్‌కు చేరుకుని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లి శ్రీ రామనాథస్వామి ఆలయ దర్శనం, బస ఉంటుంది.
నాలుగో రోజు మధురై చేరుకుని మీనాక్షి అమ్మవారి దర్శనం, షాపింగ్‌కు అవకాశం కల్పిస్తారు.
ఐదో రోజు కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం వంటి ప్రదేశాలు సందర్శిస్తారు.
ఆరవ రోజు తిరుచిరాపల్లిలో శ్రీరంగనాథస్వామి ఆలయం, అనంతరం తంజావూరులో బృహదీశ్వర ఆలయ దర్శనం ఉంటుంది.
ఏడో రోజు చిదంబరం చేరుకుని నటరాజ స్వామి దర్శనం అనంతరం రాత్రి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ఎనిమిదో రోజు రాత్రికి యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు
స్లీపర్ క్లాస్: రూ.14,500 (పిల్లలకు రూ.13,500)
3ఏసీ: పెద్దలకు రూ.21,700, పిల్లలకు రూ.20,600
2ఏసీ: పెద్దలకు రూ.27,900, పిల్లలకు రూ.26,600

ప్యాకేజీలో కలిగే సదుపాయాలు
ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి శాకాహార భోజనం అందిస్తారు. ప్యాకేజీకి అనుగుణంగా వాహన సౌకర్యం, హోటల్ బస, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సేవలు ఉంటాయి. అయితే కొన్ని ప్రదేశాల్లో ప్రవేశ రుసుములు, అదనపు సదుపాయాల ఖర్చులు వ్యక్తిగతంగా చెల్లించాలి. ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సౌకర్యవంతంగా, ఒకే ప్రయాణంలో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు IRCTC వెబ్‌సైట్ irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News