బేబీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ABN , Publish Date - Sep 08 , 2026 | 03:42 PM
ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తలు ప్రశాంతంగా కలిసి కొంత సమయం గడిపేందుకు చేసే ప్రత్యేక ప్రయాణమే ‘బేబీమూన్’. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే బేబీమూన్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గర్భం దాల్చిన తర్వాత మహిళ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. శరీరంలో మార్పులతో పాటు హార్మోన్ల ప్రభావం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు బిడ్డ పుట్టిన తర్వాత బాధ్యతలు మరింత పెరుగుతాయి. అందుకే బిడ్డ పుట్టకముందే భార్యాభర్తలు కలిసి ప్రశాంతంగా కొంత సమయం గడిపేందుకు చేసే ప్రత్యేక ప్రయాణమే ‘బేబీమూన్’.
బేబీమూన్ ఎప్పుడు ప్లాన్ చేయాలి?
చాలా మంది జంటలు గర్భధారణ రెండో త్రైమాసికంలో, సాధారణంగా 14 నుంచి 28 వారాల మధ్య బేబీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఎక్కువ దూరం కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉన్న రిసార్టులు, ప్రకృతి ప్రదేశాలు లేదా వెల్‌నెస్ రిట్రీట్‌లను ఎంచుకుంటున్నారు. అరకు, అనంతగిరి హిల్స్, ఊటీ, కూర్గ్, దక్షిణ గోవా వంటి ప్రకృతి అందాలు ఉన్న ప్రాంతాలను కొందరు బేబీమూన్ కోసం ఎంచుకుంటున్నారు. అయితే గమ్యస్థానం ఎంపిక కంటే గర్భిణి ఆరోగ్య పరిస్థితికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి
బేబీమూన్ ప్లాన్ చేసుకునే ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. గర్భధారణ పరిస్థితిని బట్టి ప్రయాణం చేయడం సురక్షితమేనా లేదా అనేది వైద్యులు సూచిస్తారు. ప్రయాణానికి అనుమతి లభించిన తర్వాత కూడా వైద్యుల ఫోన్ నంబర్‌ను వెంట ఉంచుకోవడం మంచిది. వెళ్లే ప్రదేశానికి సమీపంలో ఆసుపత్రి, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ముఖ్యంగా దూరమైన లేదా కొండ ప్రాంతాలకు వెళ్లేవారు ఈ విషయంపై మరింత శ్రద్ధ పెట్టాలి.

ఆరోగ్యం బాగాలేకపోతే ప్రయాణం వద్దు
గర్భధారణ సమయంలో తీవ్రమైన వికారం, వాంతులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. ఇతరులు బేబీమూన్‌కు వెళ్లారని మనం కూడా అదే సమయంలో వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ట్రిప్‌లను చూసి నిర్ణయం తీసుకోకుండా, స్వంత ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోవాలి.
ప్రయాణ సమయంలో ఆహారం, నీటిపై జాగ్రత్త
బయటకు వెళ్లినప్పుడు కొత్త రకాల ఆహారాలను ఎక్కువగా ప్రయత్నించకుండా, శరీరానికి అలవాటైన ఆహారాన్నే తీసుకోవడం మంచిది. పరిశుభ్రమైన నీటిని తాగాలి. అవసరమైన మందులు, వైద్యులు సూచించిన సప్లిమెంట్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్ వంటివి వెంట ఉంచుకోవాలి. అలాగే ఎక్కువసేపు ప్రయాణించాల్సి వస్తే మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. విమానం లేదా రైలులో ప్రయాణించే సమయంలో వీలైనప్పుడు లేచి కొద్దిసేపు కదలడం, తగినంత నీరు తాగడం మంచిది.

దుస్తుల్లో సౌకర్యానికే ప్రాధాన్యం
బేబీమూన్ సమయంలో అందంగా కనిపించడం కంటే సౌకర్యంగా ఉండటం ముఖ్యం. ఎక్కువ బిగుతుగా లేని, శరీరానికి ఇబ్బంది కలగని దుస్తులను ఎంచుకోవాలి. ప్రయాణానికి అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవు.
దూరం వెళ్లలేకపోతే దగ్గర్లోనే..
ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టంగా అనిపిస్తే ఇంటికి సమీపంలోని ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. వారాంతంలో చిన్న ట్రిప్ లేదా వెల్‌నెస్ రిట్రీట్ కూడా మంచి ఎంపిక కావచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో భాగస్వామితో కలిసి సమయం గడపడం, తేలికగా నడవడం, ధ్యానం వంటి సులభమైన కార్యకలాపాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడవచ్చు.
ఆరోగ్యమే మొదటి ప్రాధాన్యం
బేబీమూన్ ఉద్దేశం ఎక్కువగా తిరగడం, ఎన్నో ప్రదేశాలు చూడటం కాదు. బిడ్డ పుట్టకముందు భార్యాభర్తలు ప్రశాంతంగా కలిసి గడపడం, తమ బంధాన్ని మరింత బలపరుచుకోవడమే ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రయాణం విషయంలో తొందరపడకుండా, వైద్యుల సూచనలు పాటిస్తూ, గర్భిణి ఆరోగ్యానికి అనుకూలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సరైన ప్రణాళికతో బేబీమూన్‌ను ఒత్తిడి లేని, ఆనందకరమైన అనుభూతిగా మార్చుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి
నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!