Share News

నేపాల్ నుంచి అమెరికా వరకు.. విదేశాల్లో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాలివే

ABN , Publish Date - Sep 09 , 2026 | 06:06 PM

వినాయక చవితి అంటే భారత్‌లోనే కాదు.. విదేశాల్లోనూ సందడి కనిపిస్తుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో గణపతికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో వినాయకుడిని ఏ పేర్లతో పిలుస్తారు, ప్రసిద్ధ ఆలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం..

నేపాల్ నుంచి అమెరికా వరకు.. విదేశాల్లో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాలివే
Famous Ganesh Temples in Abroad

ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి వచ్చిందంటే భారత్‌లో ప్రతి ప్రాంతంలోనూ పండుగ సందడి కనిపిస్తుంది. చిన్న చిన్న మండపాల నుంచి భారీ విగ్రహాల వరకు గణపయ్యను ఘనంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. భక్తులు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహిస్తూ నవరాత్రులను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే గణపతిపై భక్తి మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ వినాయకుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆయనను వివిధ పేర్లతో పిలుస్తూ పూజిస్తారు. అలాంటి కొన్ని ప్రముఖ ఆలయాలు, వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..


సూర్య వినాయక ఆలయం – నేపాల్

నేపాల్‌లోని భక్తపూర్ ప్రాంతంలో సూర్య వినాయకుడికి అంకితమైన పురాతన ఆలయం ఉంది. ఖాట్మాండు లోయలోని ప్రముఖ నాలుగు వినాయక క్షేత్రాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి చేరుకోవడానికి కొంత దూరం నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నేపాల్‌లోని మరో ప్రసిద్ధ గణపతి క్షేత్రం జల వినాయక ఆలయం.

శ్రీ సితి వినాయగర్ ఆలయం – మలేషియా

మలేషియాలోని సెలంగోర్ ప్రాంతంలో ఉన్న శ్రీ సితి వినాయగర్ ఆలయం గణపతి భక్తులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. పెటాలింగ్ జయ పరిసరాల్లో ఉన్న ఈ ఆలయాన్ని స్థానికంగా పిజె పిళ్లైయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. మలేషియాతో పాటు సింగపూర్‌లోనూ ప్రసిద్ధ వినాయక ఆలయం ఉంది. సిలాన్ రోడ్డులో ఉన్న శ్రీ సెంపగ వినాయగర్ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఆలయం చోళుల కాలంతో సంబంధం ఉన్నదిగా చెబుతారు.


శ్రీ వరతరాజ సెల్వవినాయక ఆలయం – నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లోని డెన్ హెల్డర్ ప్రాంతంలో శ్రీ వరతరాజ సెల్వవినాయక ఆలయం ఉంది. దేశంలోని పురాతన గణపతి ఆలయాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీలంక నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లిన తమిళులు 1991లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.

ఐర్లాండ్‌లో వినాయక విగ్రహాలు

ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లో ప్రాంతంలో వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వినాయకుడిపై భక్తి పెంచుకున్న విక్టర్ లాంగ్ హెల్డ్ అనే వ్యక్తి అక్కడ గ్రానైట్ రాళ్లతో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ విగ్రహాలను తమిళనాడుకు చెందిన శిల్పులు రూపొందించారు. కొన్ని విగ్రహాలు సుమారు ఐదు అడుగుల ఎత్తు ఉంటాయి.

అమెరికాలో శ్రీ మహావల్లభ వినాయక ఆలయం

అమెరికాలోని న్యూయార్క్ నగర పరిధిలో శ్రీ మహావల్లభ వినాయక ఆలయం.. భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. అమెరికాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ గణపతి ఆలయాలు, విగ్రహాలు కనిపిస్తాయి. వినాయకుడు భారతీయ సంస్కృతిలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో భక్తుల ఆరాధ్యదైవంగా నిలిచారు. దేశం ఏదైనా.. గణపతిపై భక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

గ్యాస్‌, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి

నిద్రలో చెమటలు పడుతున్నాయా? కారణం ఇదే కావచ్చు!

Updated Date - Sep 09 , 2026 | 06:06 PM