మాట కోసం... మట్టి ఇళ్లలో నివాసం!
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:36 PM
ఎంత డబ్బున్నా, సాదాసీదా జీవన విధానాన్ని ఇష్టపడేవారు చాలా కొద్దిమంది కనిపిస్తారు. అయితే రాజస్థాన్‌లో బీవ్మార్ జిల్లాలో ఉన్న ‘దేవ్‌మాలీ’ గ్రామంలోకి అడుగుపెడితే... ఊరు ఊరంతా సాధారణ జీవనం గడుపుతున్న దృశ్యం కనిపిస్తుంది.
ఎవరైనా సరే నాలుగు డబ్బులు సంపాదించగానే మంచి ఇల్లు కట్టుకుంటారు. లగ్జరీగా బతకాలని కోరుకుంటారు. కానీ ఆ ఊరిలో అడుగుపెడితే... అక్కడ ఒక్క డాబా ఇల్లు కూడా కనిపించదు. వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్నా మట్టి ఇంట్లోనే ఉంటారు. పైగా మాంసాహారం, మద్యం ముట్టరు. గ్రామస్థులంతా సాదాసీదాగా ఎందుకు, ఎలా జీవిస్తున్నారు? ఇంతకీ ఆ విశిష్ట గ్రామం ఎక్కడుంది??
ఎంత డబ్బున్నా, సాదాసీదా జీవన విధానాన్ని ఇష్టపడేవారు చాలా కొద్దిమంది కనిపిస్తారు. అయితే రాజస్థాన్‌లో బీవ్మార్ జిల్లాలో ఉన్న ‘దేవ్‌మాలీ’ గ్రామంలోకి అడుగుపెడితే... ఊరు ఊరంతా సాధారణ జీవనం గడుపుతున్న దృశ్యం కనిపిస్తుంది. మంచి మంచి వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లాది రూపాయలు గడిస్తున్నా... సాధారణ జీవనం గడిపేందుకే ఆ ఊరి ప్రజలు ఇష్టపడుతుంటారు. ఊరి నిండా మట్టి ఇళ్లే. ఇటుక, సిమెంట్‌తో నిర్మించిన ఒక్క భవంతి కూడా కనిపించదు. అందుకే ఆ గ్రామం ‘బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఇన్ ఇండియా’గా గుర్తింపు పొందింది.
దేవుడు అడుగిడిన గ్రామం
గ్రామస్థులందరికీ మంచి ఆదాయం ఉన్నా వారు విలాసవంతమైన జీవనం గడపకపోవడానికి కారణం ఉంది. ఆ ఊరి ప్రజలు దేవనారాయణ్‌ను పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల ఊరు దేవనారాయణ్‌కు చెందినది విశ్వసిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నా... ఎవ్వరికీ కూడా భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు చూపే కాగితాలు లేవు. ఎవ్వరూ కూడా భూమి పత్రాల గురించి ఆలోచించరు. ‘గ్రామంలో ఎలాంటి పక్కా ఇళ్లు నిర్మించమని దేవుడికి వాగ్దానం చేశామని, దానికి కట్టుబడి ఉంటున్నామ’ని అంటారు గ్రామస్థులు. అంతేకాదు గ్రామస్థులు ఎవ్వరూ కూడా మాంసాహారం ముట్టరు, మద్యం తాగరు. అక్కడ కిరోసిన్‌ను మండించడం కూడా నిషేధం. గ్రామ సమీపంలో ఉన్న కొండపై ‘దేవనారాయణ’ ఆలయం ఉంది. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఏటా లక్షల మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.
స్థానికుల కథనం ప్రకారం... కొన్ని వందల ఏళ్ల క్రితం దేవనారాయణ్ వాళ్ల గ్రామానికి వచ్చి, బస చేయడానికి గ్రామస్థులను స్థలం అడిగాడట. వెంటనే గ్రామస్థులు ఒక ఇల్లు మట్టితో కట్టి ఇచ్చారట. అంతేకాకుండా తమ కోసం ఎప్పుడూ గ్రామంలో శాశ్వత ఇల్లు కట్టుకోబోమని చెప్పారట. అప్పటి నుంచి ఆ ఊరిలో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గ్రామంలో ఎక్కువగా గుర్జర్ కమ్యూనిటీకి చెందిన వాళ్లే నివసిస్తున్నారు. ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మట్టి ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. వారి నమ్మకమే ‘దేవ్‌మాలీ’ని ప్రత్యేకంగా నిలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి.
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News