Share News

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే 9 ఆహార పదార్థాలు ఇవే..

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:42 AM

మారుతున్న జీవనశైలిలో జీవన ప్రమాణం పెరుగుతున్నప్పటికీ.. మానసిక ఆరోగ్యం ఎల్లప్పుడూ వెనుకబడిపోతోంది. ఆహార పదార్థాలతో మానసిక సమస్యలైన డిప్రెషన్, ఆందోళనను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా.. పదండి తెలుసుకుందాం..

మానసిక ఆరోగ్యానికి మేలు చేసే 9 ఆహార పదార్థాలు ఇవే..
foods for mental health

శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం ఆహారం తీసుకోవాలో మనకు తెలుసు. మరి అదే ఆహారం మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని మీకు తెలుసా.. అవునండీ.. మెడిటేషన్లు, వ్యాయామాలు, సంగీతం వినడం లాంటి వాటికి భిన్నంగా.. మన ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా..


గుమ్మడిగింజలు: గుమ్మడి గింజలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో పొటాషియం, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహకరిస్తాయి.

పసుపు: పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి.. శరీరాన్ని సాధారణస్థితికి తీసుకువస్తుంది.


గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీనిలో ఉండే థియానైన్ అనే అమైనో ఆసిడ్.. మానసిక స్థితిలో వచ్చే మార్పులను నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ప్రశాంతతను కలిగించే పెరటోనిన్, డోపమైన్‌ల ఉత్తత్తిని ప్రేరేపిస్తుంది.

బెర్రీలు: అన్నీ రకాల బెర్రీలు ( స్ట్రాబెర్రీ నుంచి బ్లూబెర్రీ వరకు) మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నిరాశాభావనను కలిగించే హార్మోన్ల ఉత్తత్తిని నియంత్రిస్తాయి.

పాలకూర: పాలకూర మనకు పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

నారింజ: సిట్రస్ జాతికి చెందిన పండ్లల్లో విటమిన్ ‘సి’ సమృద్ధిగా దొరుకుతుంది. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి. నారింజను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


కాఫీ: రోజుకో కప్పు కాఫీ.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కాఫీ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని, డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తుంది.

పిస్తా: రోజు గుప్పెడు పిస్తా గింజలు తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, రక్తపోటు, ఆందోళనను తగ్గిస్తుంది.

పెరుగు: పెరుగు, ఇతర పాల ఉత్పత్తులలో ప్రో బయాటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరచడంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Updated Date - Nov 25 , 2026 | 07:42 AM