ఆహారమే కాదు.. భోజనం చేసే ప్లేట్ కూడా ముఖ్యమే!
ABN , Publish Date - Sep 02 , 2026 | 02:55 PM
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు.. దాన్ని ఏ పాత్రలో తింటున్నామన్నది కూడా ముఖ్యమేనని ఆయుర్వేద సంప్రదాయం చెబుతోంది. బంగారం, వెండి, కంచు, ఇత్తడి, ఇనుము, అరటి ఆకులు వంటి వాటికి ప్రత్యేక గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్, స్టీల్, సిరామిక్, ఫైబర్ వంటి వివిధ రకాల ప్లేట్లు, పాత్రలను ఉపయోగించడం సాధారణమైపోయింది. అయితే మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో.. దాన్ని వడ్డించే పాత్ర కూడా అంతే ముఖ్యమని మన పూర్వీకులు భావించేవారు. ఆయుర్వేదంలో వివిధ లోహాలు, సహజ పదార్థాలతో తయారైన పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక్కో రకమైన పాత్రకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బంగారు పాత్రలు
ఆయుర్వేద సంప్రదాయంలో బంగారాన్ని శరీరానికి అనుకూలమైన లోహంగా పరిగణిస్తారు. బంగారు పాత్రల్లో భోజనం చేయడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆయుర్వేద విశ్వాసం. శరీరానికి స్థిరత్వం, సంపూర్ణ ఆరోగ్యం అందుతాయని చెబుతారు.
వెండి పాత్రల్లో భోజనం
వెండి పాత్రలకు చలువ చేసే స్వభావం ఉందని ఆయుర్వేదంలో పేర్కొంటారు. వెండి కంచంలో భోజనం చేయడం వల్ల శరీరంలో అధిక వేడి తగ్గుతుందని, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందని సంప్రదాయ వైద్యం చెబుతోంది. అలాగే వాత, కఫ దోషాల సమతుల్యతకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తారు.
కంచు పాత్రలు ఎందుకు ప్రత్యేకం?
కంచు పాత్రలను సంప్రదాయంగా భోజనానికి ఉపయోగించేవారు. వీటిలో ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తికి మేలు కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆహార రుచి మెరుగుపడటంతో పాటు శరీరంలోని రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత సమతుల్యతకు సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటారు.
ఇత్తడి పాత్రల్లో తినడం
ఇత్తడి పాత్రలను కూడా పూర్వకాలంలో విరివిగా ఉపయోగించేవారు. వీటిలో భోజనం చేయడం వల్ల శరీరంలో వాత గుణం, ఉష్ణత కొంత పెరుగుతాయని ఆయుర్వేద భావన. జీర్ణవ్యవస్థలోని క్రిములు, అధిక కఫాన్ని తగ్గించడంలో ఇవి సహాయపడతాయని సంప్రదాయ వైద్యం చెబుతోంది.
ఇనుము, ఉక్కు పాత్రలు
ఇనుము, ఉక్కుతో తయారైన పాత్రల్లో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేదంలో పేర్కొంటారు. శరీరంలో ఏర్పడే వాపులు, తెల్ల మచ్చలు, కామెర్లు వంటి సమస్యలను నివారించడంలో ఇవి దోహదపడతాయని సంప్రదాయ నమ్మకం.
విస్తరాకుల్లో భోజనం..
అరటి ఆకులు, ఇతర సహజ ఆకులను భోజనం వడ్డించడానికి ఉపయోగించడం మన సంప్రదాయంలో భాగం. విస్తరాకులో భోజనం చేయడం వల్ల ఆహారానికి ప్రత్యేకమైన రుచి వస్తుందని చాలామంది భావిస్తారు. భోజనం పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ఆకులోని సహజ గుణాలు ఆహారంతో కలిసే అవకాశం ఉంటుందని ఆయుర్వేద సంప్రదాయంలో చెబుతారు.
నీటిని ఏ పాత్రలో తాగాలి?
నీటిని నిల్వ చేసేందుకు, తాగేందుకు కూడా సంప్రదాయంగా లోహ పాత్రలను ఉపయోగించేవారు. అందుబాటులో ఉన్న పరిస్థితులను బట్టి వెండి, రాగి వంటి లోహ పాత్రలను ఉపయోగించవచ్చని ఆయుర్వేద సంప్రదాయంలో చెబుతారు. లోహ పాత్రలు అందుబాటులో లేనప్పుడు మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగడం మంచి సంప్రదాయ పద్ధతిగా భావిస్తారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు