నోటి సమస్యల కారణంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడలేకపోతున్నారా.. ఇదిగో పరిష్కారం
ABN , Publish Date - Nov 01 , 2026 | 08:57 AM
ఎవరితో కలవలేకపోతున్నారా.. నలుగురితో నవ్వుతూ మాట్లాడడానికి జంకుతున్నారా.. నోటి దుర్వాసన, పళ్ల పసుపు మీ ఆత్మవిశ్వాసానికి అడ్డుగా మారుతున్నాయా.. బ్రష్ చేసినా ఫలితం లేకుండా పోతుందా.. అసలు కరెక్ట్ పద్ధతిలోనే బ్రష్ చేస్తున్నారా..?
మీకు బ్రష్ చేసుకోవడం వచ్చా.. ఇదేం ప్రశ్న.. బ్రష్ చేసుకోవడం రాని వాళ్లు ఉంటారా.. అని ఆలోచిస్తున్నారా.. అవును ఉంటారు. బ్రష్ చేసుకోవడం వేరు.. కరెక్ట్ పద్దతితో బ్రష్ చేసుకోవడం వేరు. చిన్నప్పటి నుంచి బ్రష్ చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నా.. సరే మీరు బ్రష్ చేసే పద్దతి సరైంది కాదు. మరి ఎలా బ్రష్ చేసుకోవాలో తెలుసుకుందామా..
1.బ్రషింగ్‌కు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు
హడావుడిగా నిద్రలేవడం, ఆఫీసుకు, ఇంటి పనులకు ఆలస్యమవుతుందని త్వరగా బ్రష్ చేయడం.. ఇది చాలా మంది జీవితంలో జరిగేదే.. రోజూ తోమే పళ్లే కదా ఏముంటుంది అనుకోకండి.. రాత్రంతా నోట్లో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కచ్చితంగా 2 నిమిషాల సమయాన్ని బ్రషింగ్‌కు కేటాయించాలి. పళ్ల సందుల్లోని ఆహార వ్యర్థాలు పూర్తిగా తొలగిపోయేలా బ్రషింగ్ చేయాలి. కింది పళ్లు, పై పళ్లు, ఎడమ, కుడి దవడ పళ్లు.. ఇలా విభజించుకుని ప్రతి భాగానికి 30 సెకన్ల చొప్పున కేటాయిస్తూ.. బ్రషింగ్ చేయాలి.
2. సాఫ్ట్ బ్రిసిల్స్ ఉండే బ్రష్‌ను ఎంచుకోవాలి
బ్రషింగ్‌లో ముఖ్యమైనది బ్రష్‌ను ఎంచుకోవడమే. సాఫ్ట్‌గా ఉన్న బ్రష్‌ను వాడడంతో పాటు.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి బ్రష్‌ను మార్చాలి. జ్వరం, జలుబు వచ్చిన తర్వాత కూడా బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలి. బ్రిసిల్స్ గట్టిగా ఉండే బ్రష్‌ను వాడడం వల్ల చిగుర్లు దెబ్బతింటాయి. దీంతో చిగుర్ల నుంచి రక్తస్రావం, వాపు లాంటి సమస్యలు కలుగుతాయి. గట్టి బ్రిసిల్స్తో బ్రష్ చేయడం ద్వారా దంతాలపై గల ఎనామిల్ పొర దెబ్బతింటుంది.
3. బ్రష్ చేసిన వెంటనే పుక్కిలించి ఊమ్మి వేయరాదు.
చాలా మంది బ్రష్ చేయగానే.. నోట్లో పలుమార్లు నీళ్లు తీసుకుని పుక్కిలించి ఉమ్మేస్తారు. ఇలా చేయడం వల్ల పేస్ట్‌లోని ఆరోగ్యకరమైన ఫ్లోరైడ్ కొట్టుకుపోతుంది. దీని వల్ల పళ్లకు సరైన పోషకాలు అందవు. బ్రష్ చేసిన వెంటనే ఏమీ తినకూడదు, తాగకూడదు. కనీసం 20 నిమిషాల వ్యవధి తరువాత ఆహారపదార్థాలు తీసుకోవాలి.
4. నాలుకను ఈ విధంగా శుభ్రపరచాలి
నాలుకపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, పాచి నోటి దుర్వాసనను కలుగజేస్తుంది. పళ్లను ఎంత శుభ్రంగా తోమినా సరే.. నాలుకను శుభ్రపరచకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికోసం టంగ్ క్లీనర్‌ను ఉపయోగించండి. లేదంటే బ్రష్ వెనుకాల గల టంగ్ క్లీనర్‌తో కూడా నాలుకను శుభ్రపరచుకోవచ్చు. టంగ్ క్లీనర్‌తో నాలుకపై రెండు సార్లు.. సున్నితంగా ముందుకు వెనుకకు అంటే చాలు.
5. ఎలా తోముతున్నారు.
దంతాలను తోమే విధానం బ్రషింగ్‌లో ముఖ్యమైనది. గిన్నెలు తోమినట్లు గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా పళ్లను రుద్దాలి. అడ్డంగా తోమకుండా.. 45 డిగ్రీల కోణంలో బ్రష్‌ను ఉంచి గుండ్రంగా తోమాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు రక్షణ కలిగించే ఎనామిల్ పొర దెబ్బతినకుండా ఉంటుంది.