చాణక్య నీతి.. ఇంటి పెద్దకు ఈ మూడు అలవాట్లు ఉంటే అంతే సంగతులు!
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:01 AM
ప్రతి కుటుంబంలోనూ ఇంటి పెద్ద కీలక పాత్ర పోషిస్తారు. నిత్యం కుటుంబాన్ని ఆయన సంరక్షిస్తారు. అలాంటి వ్యక్తి ప్రవర్తన, నిర్ణయాలు, అలవాట్లు మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి కుటుంబంలోనూ ఇంటి పెద్ద కీలక పాత్ర పోషిస్తారు. నిత్యం కుటుంబాన్ని ఆయన సంరక్షిస్తారు. అలాంటి వ్యక్తి ప్రవర్తన, నిర్ణయాలు, అలవాట్లు మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంటి పెద్ద బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రతి నిర్ణయాన్నీ వివేకంతో తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆచార్య చాణక్యుడు కొన్ని బోధనలు చేశారు. కుటుంబాన్ని నడిపించే వ్యక్తికి ఉండకూడని మూడు అలవాట్లను ఆయన నీతి సూత్రలతో వివరించారు. ఎందుకంటే ఈ అలవాట్లు ఆర్థిక పరిస్థితిని క్షీణించేలా చేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య దూరాన్నీ పెంచుతాయి. అసలు ఆ మూడు అలవాట్లు ఏంటి? తెలుసుకుందాం రండి.
డబ్బును వృథా చేయొద్దు
ఆచార్య చాణక్యుడి ప్రకారం డబ్బును ఎప్పుడూ వృథా చేయరాదు. మితిమీరిన ఖర్చులు లేనిపోని ఇబ్బందులను తెచ్చిపెడతాయి. అందుకే ఇంటి పెద్ద వ్యయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎంత ఖర్చు చేయాలనేదానిపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలి. విలాసాలను పక్కన పెడితే మరీ మంచిది. కుటుంబానికి సంబంధించిన అనవసర ఖర్చులను తగ్గించాలి. డబ్బును వృథా చేయడం చిన్న విషయం కాదు. దీని వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి. పెద్దల ఆరోగ్యం, పిల్లల చదువు.. ఇలా ప్రతి విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని పొదుపునకు ప్రాధాన్యమివ్వాలి.
వ్యసనాలకు దూరం
ఇంటి పెద్దకు జూదం, మద్యం లాంటి వ్యసనాలు ఉంటే అది కుటుంబాన్ని దెబ్బతీస్తుంది. వీటి వల్ల ఆరోగ్యం, ఆదాయం పైన ప్రభావం పడుతుంది. వ్యసనం కారణంగా కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఈ అలవాట్లతో ఇంట్లో వాదనలు, గొడవలు పెరుగుతాయి. దీంతో భార్యాభర్తలు మధ్య అనుబంధం బలహీనపడుతుంది. ఇంటి పెద్దపై కుటుంబ సభ్యులు నమ్మకాన్ని, గౌరవాన్నీ కోల్పోతారు.
మహిళలను గౌరవించాలి
చాణక్య నీతి స్త్రీల గౌరవానికి ప్రాధాన్యం ఇస్తోంది. కుటుంబంలోని మహిళలను ఇంటి పెద్ద గౌరవించాలని అది సూచిస్తోంది. స్త్రీలకు తగిన గౌరవం లభించని ఇంట్లో సంతోషం, శాంతి ఉండవని హెచ్చరిస్తోంది. కొన్నిసార్లు తన భార్య అభిప్రాయానికి కుటుంబ పెద్ద విలువ ఇవ్వరు. నిర్ణయాల సమయంలో ఆమె ఆలోచనలను పరిగణనలోకి తీసుకోరు. కొందరు ఇంట్లోని మహిళలను తక్కువగా చూస్తారు. ఈ అలవాట్లు కుటుంబంపై ప్రభావం చూపుతాయని అంటోంది చాణక్య నీతి.
చాణక్య నీతికి సంబంధించిన మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
చాణక్య నీతి.. పగటిపూట నిద్రపోతే ఈ నష్టాలు తప్పవు!
ఈ చాణక్య నీతి సూత్రలతో అత్తాకోడళ్ల మధ్య గొడవలు మాయం