Share News

కుటుంబ సభ్యులతో కూడా ఈ 5 విషయాలు చెప్పకూడదట!

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:04 PM

కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలను మాత్రం పంచుకోకపోవడమే మంచిదని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఆ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం..

కుటుంబ సభ్యులతో కూడా ఈ 5 విషయాలు చెప్పకూడదట!
Things not to share with family

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనుకుంటాం. ఎందుకంటే మనకు అత్యంత దగ్గరగా ఉండేది కుటుంబమే. అయితే చాణక్య నీతి ప్రకారం.. కొన్ని విషయాలను ఎంత సన్నిహితులైనా సరే పంచుకోకపోవడమే మంచిదట. ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చని చాణక్యుడు సూచించారు.


ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నష్టం

వ్యాపారంలో నష్టం రావడం, జీతం తగ్గడం, అప్పులు పెరగడం వంటి ఆర్థిక సమస్యలు ఎదురైతే వాటిని ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ బాధపడకూడదని చాణక్య నీతి సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితి గురించి పదే పదే చర్చించడం వల్ల కుటుంబంలో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా దెబ్బతినొచ్చు.

అయితే పరిస్థితి తీవ్రంగా ఉండి కుటుంబ సభ్యుల సహాయం అవసరమైతే మాత్రం సమస్యను వారితో పంచుకోవడం మంచిదే. అవసరం లేని చోట ఆర్థిక సమస్యలను అందరి ముందు చర్చించకుండా, పరిష్కారం కోసం ప్రశాంతంగా ప్రయత్నించడం మంచిదని చాణక్య నీతి చెబుతుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యక్తిగత విభేదాలు

భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, వ్యక్తిగత విభేదాలను ఇతర బంధువులు లేదా కుటుంబ సభ్యుల ముందు చెప్పుకోవడం మంచిది కాదని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే ఒకసారి వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లిన తర్వాత వాటిని తిరిగి గోప్యంగా ఉంచడం కష్టం. ఇలాంటి విషయాలను ఇతరులతో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అందుకే భార్యాభర్తలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే ఉత్తమమని చాణక్యుడు సూచించారు.


బయట ఎదురైన అవమానాలు

పని చేసే చోట లేదా ఇతరుల వల్ల ఎవరైనా అవమానానికి గురైతే.. ఆ విషయాన్ని ఇంటికి వచ్చి పదే పదే అందరితో చెప్పుకుంటూ బాధపడకూడదని చాణక్య నీతి సూచిస్తుంది. అవమానం ఎదురైనప్పుడు దాని నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగడం మంచిదట. ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులతో చెప్పుకోవడం వల్ల వారు కూడా ఆ సంఘటన గురించి ఆందోళన చెందవచ్చు. అందుకే ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, మన పనితీరు, కృషితో మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చాణక్య నీతి చెబుతుంది.

బలహీనతలు, భయాలు

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది. అయితే మనకు ఉన్న ప్రధాన బలహీనతలను అందరికీ చెప్పకపోవడమే మంచిదని చాణక్య నీతి సూచిస్తుంది. ఎందుకంటే మన బలహీనతలు ఇతరులకు తెలిసినప్పుడు.. భవిష్యత్తులో వాటిని మనపై ఒత్తిడి తీసుకురావడానికి లేదా మన నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే మన వ్యక్తిగత బలహీనతలు, భయాలను అందరికీ చెప్పకూడదని చాణక్యుడు చెబుతారు.


భవిష్యత్తు ప్రణాళికలు, పెద్ద కలలు

కొత్త వ్యాపారం ప్రారంభించడం, విలువైన వస్తువు కొనడం, ఉద్యోగం లేదా వృత్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం వంటి పెద్ద ప్రణాళికలు ఉంటే.. అవి పూర్తయ్యే వరకు వాటి గురించి ఎక్కువగా అందరికీ చెప్పకపోవడం మంచిదని చాణక్య నీతి చెబుతుంది. కొన్నిసార్లు మనపై ప్రేమ, శ్రద్ధతో కుటుంబ సభ్యులు కూడా అనేక సందేహాలు వ్యక్తం చేయవచ్చు. అవి మనలో భయం లేదా అనుమానాలను పెంచి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా మన లక్ష్యంపై దృష్టి పెట్టి, దాన్ని సాధించిన తర్వాత విజయాన్ని ఇతరులతో పంచుకోవడం మంచిదని చాణక్య నీతి సూచిస్తుంది.

Also Read:

కీవ్‌పై రష్యా డ్రోన్ దాడి.. 27 మంది మృతి

అది అంటరానితనానికి మరో రూపం.. బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం..

Updated Date - Aug 29 , 2026 | 04:10 PM