ఈ 4 గుణాలు మీలో ఉంటే, ఎలాంటి కష్టాన్నైనా సులభంగా అధిగమించగలరు!
ABN , Publish Date - Sep 28 , 2026 | 03:05 PM
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను వివరించారు. ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చని ఆయన భావిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’లో మనిషి జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను వివరించారు. ప్రకృతిలోని ప్రతి జీవి నుంచి మనం ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కుక్కలో కనిపించే నాలుగు గుణాలను మనిషి అలవర్చుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చనే సూచించారు.
ఉన్నదానితో సంతృప్తి చెందడం
కుక్కకు ఏ ఆహారం దొరికినా దానితో సంతృప్తిగా ఉంటుంది. చిన్న మొత్తంలో ఆహారం దొరికినా సంతోషంగా తింటుంది. మనిషి కూడా తన జీవితంలో అవసరానికి మించి కోరికలు పెంచుకోకుండా.. తనకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలని చాణక్య నీతి చెబుతుంది. అయితే సంతృప్తి అంటే అభివృద్ధి కోసం ప్రయత్నించకపోవడం కాదు. మనకు ఉన్నదానిని విలువైనదిగా భావిస్తూనే.. భవిష్యత్తు కోసం కష్టపడటం ముఖ్యం.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం
కుక్క నిద్రలో ఉన్నప్పటికీ చిన్న శబ్దానికి కూడా వెంటనే మేల్కొంటుంది. దీన్ని అప్రమత్తతకు ఉదాహరణగా చెబుతారు. అలాగే మనిషి కూడా విశ్రాంతి తీసుకుంటూనే తన బాధ్యతలు, లక్ష్యాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా స్పందించేలా మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవడం అవసరం.
విశ్వాసం, విధేయత
కుక్క తనను ఆదరించే వ్యక్తి పట్ల విశ్వాసంగా ఉంటుందని సాధారణంగా చెబుతారు. తనకు సహాయం చేసినవారిని గుర్తుంచుకోవడం, కష్టకాలంలో అండగా నిలిచినవారిని మరచిపోకపోవడం కూడా మంచి లక్షణాలుగా భావిస్తారు. మనిషి కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో నిజాయితీగా ఉండాలి. మనపై నమ్మకం ఉంచినవారి పట్ల విశ్వాసంగా ఉండటం బంధాలను బలపరుస్తుంది.
ధైర్యంగా ఉండటం
తన పరిధిలోకి మరో కుక్క వచ్చినప్పుడు.. తనకంటే బలంగా ఉన్నా కూడా కుక్క వెనక్కి తగ్గకుండా ఎదుర్కొంటుంది. దీన్ని ధైర్యానికి ఉదాహరణగా చెబుతారు. అదేవిధంగా మనిషి కూడా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. తన విలువలు, లక్ష్యాల విషయంలో స్థిరంగా ఉండాలి. అన్యాయం ఎదురైనప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ధైర్యంగా స్పందించాలి.
Also Read:
పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..
'ప్రజల మధ్య ప్రశ్నిస్తే చెంపదెబ్బ.. పేపర్ లీక్స్ గురించి అడిగితే లాఠీచార్జ్'