ChatGPT: చాట్‌జీపీటీ సలహా ఫాలో అయినందుకు అంతర్గత రక్తస్రావం.. వైద్యురాలి హెచ్చరిక
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:57 PM
ఏఐ చాట్‌బాట్ ఇచ్చే వైద్య సలహాలను గుడ్డిగా నమ్మి చిక్కుల్లో పడ్డ ఓ పేషెంట్ గురించి ఎయిమ్స్ వైద్యురాలు ఒకరు తెలిపారు. చాట్‌బాట్స్ ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ సందేహాన్నైనా ఇట్టే తీర్చేసే ఏఐ చాట్‌బాట్స్‌పై సామాన్యుల్లో నమ్మకం అంతకంతకూ పెరుగుతోంది. కొందరు ఈ చాట్‌బాట్స్ ఇచ్చే వైద్య సలహాలనూ మరో ఆలోచన లేకుండా ఫాలో అయిపోతున్నారు. సరిగ్గా ఇలాగే చేసిన ఓ పేషెంట్‌కు అంతర్గత రక్తస్రావం కావడంతో చిక్కుల్లో పడ్డారని ఎయిమ్స్ వైద్యురాలు, రూమెటాలజీ విభాగాధిపతి డా. ఉమా కుమార్ తాజాగా హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె ప్రజలకు ఈ విషయంలో కీలక హెచ్చరిక చేశారు.
కొంతకాలంగా వీపు నొప్పితో బాధపడుతున్న ఆ పేషెంట్ చాట్‌జీపీటీ సలహా మేరకు కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడారని తెలిపారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా పెయిన్ కిల్లర్స్‌పైనే ఆధారపడ్డందుకు పరిస్థితి ముదిరి అంతర్గత బ్లీడింగ్ వరకూ వెళ్లిందని వివరించారు.
వైద్యం అంటే తక్షణ చికిత్సలతో ఉపశమనం కల్పించడం కాదని డా. ఉమ వివరించారు. రోగి సమస్యలకు కారణమేమిటో ఓ పద్ధతి ప్రకారం అంచనా వేసి, మెడికల్ టెస్టుల ఆధారంగా చికిత్స విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. ఏఐ చాట్‌బాట్స్ మాత్రం ఇలాంటివేవీ తెలుసుకోకుండానే కేవలం రోగి ఇచ్చిన అసంపూర్ణ వివరాల ఆధారంగా ఏవో చికిత్సలు చెబుతాయని అన్నారు.
ఏఐ హాల్యూసినేషన్స్‌తో మరింత ప్రమాదం ఉందని కూడా వైద్యులు చెబుతున్నారు. అసమగ్ర సమాచారం, పరిష్కారాలను కూడా కచ్చితమైనవనే నమ్మకం కలిగించేలా చాట్‌బాట్స్ యూజర్లకు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు యూజర్లు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రత్యామ్నాయాలు తగ్గి.. మనుషుల వైపు మళ్లుతున్న దోమలు! కొత్త అధ్యయనంలో వెల్లడి
విజయం కోసం తపిస్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే గెలుపు మీదే