Share News

Mosquito Bites: ప్రత్యామ్నాయాలు తగ్గి.. మనుషుల వైపు మళ్లుతున్న దోమలు! కొత్త అధ్యయనంలో వెల్లడి

ABN , Publish Date - Jan 18 , 2026 | 08:12 AM

అడవుల విస్తీర్ణం తగ్గడంతో దోమలు జనావాసాల వైపు అధికంగా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరో పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Mosquito Bites:  ప్రత్యామ్నాయాలు తగ్గి.. మనుషుల వైపు మళ్లుతున్న దోమలు! కొత్త అధ్యయనంలో వెల్లడి
Deforestration Leading To Mosquito Menace

ఇంటర్నెట్ డెస్క్: దోమల బెడద అంతకంతకూ పెరుగుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. దీనిపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకర విషయాన్ని గుర్తించారు. దోమల బెడద పెరగడానికి కూడా మానవ కార్యకలాపాలే కారణమని తేల్చారు. ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరోకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఫ్రాంటియర్స్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఎకాలజీ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి (Deforestration Increasing Mosquito Menace).

బ్రెజిల్‌లోని అటవీ ప్రాంతంలో వివిధ దోమల జాతులను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందుకోసం వారు ఉచ్చులను ఏర్పాటు చేసి 52 జాతులను పట్టుకున్నారు. మగా, ఆడ దోమలను వేరు చేసి పరీక్షించారు. 1700 శాంపిల్స్‌పై టెస్టులను నిర్వహించారు. ఈ క్రమంలో దోమల రక్తంలో 24 రకాల డీఎన్‌ఏలను గుర్తించగా అందులో సుమారు 18 రకాలు మనుషులవేనని అన్నారు. అంటే.. దోమలు ఎక్కువగా మనుషుల రక్తంపై ఆధారపడుతున్నాయని వివరించారు.


జనావాసాలు పెరుగుతున్న కొద్దీ అడవులు కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా జంతుజాలం సంఖ్య తగ్గిపోతోంది. దీంతో, దోమలకు ప్రత్యామ్నాయాలు లేక మనుషుల రక్తం తాగేందుకు అలవాటు పడుతున్నాయి. ప్రస్తుతం భూమ్మీద అత్యధిక సంఖ్యలో ఉన్నది మనుషులే కాబట్టి దోమలు జనావాసాల వైపు మళ్లుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం పెరుగుతున్న కొద్దీ దోమలు గుడ్లు పెట్టే కాలం నిడివి కూడా పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు.

దోమల వల్ల డెంగీ, జీకా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. కొన్ని దేశాల్లో ఇది ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది మరణిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. దోమల బెడద గురించి లోతుగా తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు జరగాలని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

విజయం కోసం తపిస్తున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే గెలుపు మీదే

వ్యాయామం వ్యసనంగా మారడంతో యువతికి షాక్.. 23 ఏళ్ల వయసులోనే..

Updated Date - Jan 18 , 2026 | 08:25 AM