Share News

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

ABN , Publish Date - May 25 , 2026 | 04:11 AM

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్‌ సర్వీస్‌ చెక్‌ పాయింట్‌ వద్దకుబ్యాగులో తుపాకీతో ...

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

  • కాల్పులకు తెగబడిన దుండగుడిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు..

  • తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మృతి

వాషింగ్టన్‌, మే 24: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్‌ సర్వీస్‌ చెక్‌ పాయింట్‌ వద్దకుబ్యాగులో తుపాకీతో దూసుకొచ్చిన ఓ దుండగుడు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన వారు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడికి తీవ్ర గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. శనివారం సాయంత్రం వైట్‌హౌస్‌ సమీపంలోని 17వ వీధి పెన్సిల్వేనియా ఎవెన్యూ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 రౌండ్ల కాల్పులు జరగ్గా.. నిందితుడితో పాటు మరో ఇద్దరు కూడా కాల్పుల్లో గాయపడ్డారు. అక్కడి జర్నలిస్టులను వైట్‌హౌస్‌లోని ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూమ్‌లోకి భద్రతా దళాలు తరలించాయి. కాల్పుల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కాల్పుల శబ్దం వినపడటంతోనే వైట్‌హౌస్‌ పరిసరాలన్నీ కాసేపు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. పోలీసులు, భద్రతా దళాలు వైట్‌హౌస్‌ వద్ద భారీగా మోహరించాయి. ఇక నిందితుడిని 21 ఏళ్ల నసీర్‌ బెస్ట్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గతేడాది జూలైలోనూ అతడు వైట్‌హౌస్‌ లోపలికి చొరబడేందుకు యత్నించినట్లు తెలిసింది. కాగా, ట్రంప్‌ సమీప పరిసరాల్లో కాల్పులు జరగడం గత నెల రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం.

Updated Date - May 25 , 2026 | 04:11 AM