Share News

ట్రంప్ కార్యక్రమంలో కాల్పులు.. నిందితుడు ఒకప్పుడు బెస్ట్ టీచర్‌గా..

ABN , Publish Date - Apr 26 , 2026 | 03:13 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని 31 ఏళ్ల కోల్ టొమాస్ అలెన్‌గా పోలీసులు గుర్తించారు. అతడు కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ట్రంప్ కార్యక్రమంలో కాల్పులు.. నిందితుడు ఒకప్పుడు బెస్ట్ టీచర్‌గా..
White House Correspondents Dinner Incident

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో శనివారం కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు కోల్‌ టొమాస్ అలెన్‌గా గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కార్యక్రమం జరుగుతున్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిందితుడు భద్రతా సిబ్బందిని దాటుకుని వెళ్లే క్రమంలో కాల్పులు జరిపాడు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర కేబినెట్ సీనియర్ మంత్రులు ఉన్న హాల్‌కు వెలుపల ఈ ఘటన జరిగింది. కాల్పుల కలకలం రేగగానే సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది ట్రంప్, ఆయన సతీమణి, మంత్రులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.


నిందితుడు అలెన్‌కు సంబంధించి పలు కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అలెన్ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2017లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ-డొమినిగెజ్ హిల్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తాను పార్ట్‌టైమ్ టీచర్‌ అని, గేమ్ డెవలపర్‌ అని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్నాడు. తాను మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్టుననీ అలెన్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నాడు. 2014లో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ రీసర్చ్ ఫెలోషిప్ కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నాడు.


టెస్ట్ ప్రిపరేషన్‌‌లో శిక్షణ ఇచ్చే సీ2 ఎడ్యుకేషన్ సంస్థలో అతడు కొంతకాలం పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేసినట్టు కొన్ని ఫెస్‌బుక్ పోస్టుల్లో ఉందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2024లో డిసెంబర్ నెలకు గాను అతడు బెస్ట్ టీచర్‌గా కూడా గుర్తింపు పొందినట్టు సమాచారం. బోర్‌డోమ్, ఫస్ట్‌లా అనే వీడియో గేమ్స్‌ను కూడా డిజైన్ చేశాడు.

తాజా ఘటనలో ప్రభుత్వ అధికారిపై కాల్పులు జరపడం, ఆయుధాలు కలిగి ఉండటం తదితర అభియోగాలతో అలెన్‌పై కేసు నమోదు చేస్తామని యూఎస్ అటార్నీ (డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) తెలిపారు. వీలైనంత హింసకు పాల్పడదామని నిందితుడు భావించి ఉండొచ్చని అటార్నీ తెలిపారు. నిందితుడి దాడి వెనుక గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి ఫొటో రిలీజ్ చేసిన ట్రంప్..

Updated Date - Apr 26 , 2026 | 04:16 PM