యూఎస్‌లో సుంకాల రీఫండ్! నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ..
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:54 PM
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కంపెనీలకు సుంకాలను రీఫండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని దిగుమతిదారులకు సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎమర్జెన్సీ చట్టం కింద కంపెనీల నుంచి వసూలు చేసిన దిగుమతి సుంకాలను రీఫండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. సుంకాల విధింపు రాజ్యాంగవిరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం నేటి నుంచీ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించింది. స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి దిగుమతిదారులు రీఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఎమర్జెన్సీ చట్టాలను ఉపయోగించి ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలను విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. చట్టసభల అధికారాల్లోకి ట్రంప్ ప్రభుత్వం జోక్యం చేసుకుందని కోర్టు అభిప్రాయపడింది. కంపెనీల నుంచి వసూలు చేసిన నిధులను తిరిగిచ్చేయాలని కూడా స్పష్టం చేసింది.
ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కంపెనీలు తాము ఏయే ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు చెల్లించిందీ వివరిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత 60 నుంచి 90 రోజుల్లో ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రీఫండ్ జాప్యం అయ్యే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, దాదాపు 3.30 లక్షల మంది దిగుమతిదారులు 166 బిలియన్ డాలర్ల మేర దిగుమతి సుంకాలను చెల్లించారు. మొత్తం 53 మిలియన్ షిప్‌మెంట్స్‌పై ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించారు. ఈ నిధులను ప్రభుత్వం దశల వారీగా రిఫండ్ చేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే ఏడాదిలోనే పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్: యూఎస్ మంత్రి
అలీ ఖమేనీ మరణం.. 7 వారాలు అవుతున్నా అంత్యక్రియలు ఎందుకు చేయటం లేదు?..