వచ్చే ఏడాదిలోనే పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్: యూఎస్ మంత్రి
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:24 AM
వచ్చే ఏడాదికి గానీ యూఎస్‌లో పెట్రోల్ ధరలు తగ్గకపోవచ్చని అమెరికా మంత్రి తాజాగా తెలిపారు. ఇప్పటికే ధరలు చేరవల్సిన గరిష్ఠస్థాయికి చేరుకున్నందున ఇకపై తగ్గుతాయని అంచనా వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్ మధ్య రాజీ కుదరకపోవచ్చన్న భయాలతో చమురు ధరల మళ్లీ పెరగడం మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌లో ఇంధన ధరలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. అయితే, వచ్చే ఏడాది వరకూ గ్యాలన్ (సుమారు 3.78 లీటర్లు) పెట్రోల్ ధరలు 3 డాలర్లకు పైబడే ఉండవచ్చని అన్నారు. ‘ధరలు ఇప్పటికే పతాకస్థాయికి చేరుకున్నాయి. కాబట్టి ఇక తగ్గడం మొదలు కావచ్చు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదికి కానీ ధరలు దిగిరాకపోవచ్చు’ అని తాజాగా ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. యుద్ధానికి ముగింపు పడితే ధరలు సహజంగానే తగ్గుముఖం పడతాయని అన్నారు.
ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తున్నాయి. ఈ ఎండాకాలంలోనే ధరలు దిగొచ్చే అవకాశం ఉందని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చెబుతున్నారు. గ్యాలన్ పెట్రోల్ ధర 3 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటుందని అన్నారు. ప్రస్తుతం యూఎస్‌లో సగటు పెట్రోల్ ధర గ్యాలన్‌కు 4 డాలర్లుగా ఉంది.
అమెరికాలో ఇంధన ధరలు పెరగడంతో ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం చట్టసభల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి స్వల్ప స్థాయి మెజారిటీ ఉంది. నవంబర్‌లో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల మద్దతును నిలుపుకోవడం ట్రంప్ ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఆరు శాతం మేర పెరిగి 95.86 డాలర్లు చేరుకుంది. మరోవైపు, ఆ జలసంధిలో ఇరాన్ నౌకను అమెరికా తాజాగా స్వాధీనం చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. యూఎస్ చర్యలపై ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.