మన ప్రజల సొమ్ము పాక్‌కు ఎందుకు ఇవ్వాలి: యూఎస్ సెనేటర్
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:19 PM
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే దేశాలకు అమెరికా ప్రజల సొమ్ము ఎందుకు ఇవ్వాలని సెనేటర్ అబ్దుల్ ఎల్ సయీద్ తాజాగా ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే దేశాలకు అమెరికా ప్రజల సొమ్ము ఎందుకు ఇవ్వాలని సెనేటర్ అబ్దుల్ ఎల్ సయీద్ తాజాగా ప్రశ్నించారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఆర్థిక సాయం నిలిపివేసేందుకు ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు. ఇటీవలి మిడ్‌టర్మ్ ఎన్నికల్లో గెలిచిన అబ్దుల్ యూఎస్ తొలి ముస్లిం సెనేటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
అమెరికా చేసే పనులు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడాలని సెనేటర్ సయీద్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ అంశం కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాకూడదని చెప్పారు. ‘మన ప్రజల సొమ్ముతో కొన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. దీనికి ముగింపు పడాలి’ అని అన్నారు. ‘కేవలం ఇజ్రాయెల్ ఒక్కటే కాదు పాకిస్థాన్, జోర్డాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా విషయంలోనూ నాది ఇదే అభిప్రాయం. అంతర్జాతీయ చట్టాలు పటిష్ఠంగా అమలయ్యేలా జాగ్రత్త తీసుకోవాల్సిన తొలి బాధ్యత మనది’ అని అన్నారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధ విక్రయాలకు కూడా ముగింపు పడాలని డిమాండ్ చేశారు. అమెరికా ఆయుధాలు మానవహననానికి దారి తీస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా పాక్‌కు అందుతున్న నిధులు ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు వినియోగం అవుతున్నాయని భారత్ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం.. ఇజ్రాయెల్‌లో పతాకస్థాయికి ఉత్కంఠ!
సౌదీపై హూతీల దాడులు.. ఆరాంకో చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయమే లక్ష్యం..