Share News

ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం.. ఇజ్రాయెల్‌లో పతాకస్థాయికి ఉత్కంఠ!

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:08 PM

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కీలక నేత ఐసెన్‌కోట్‌కు దేశాధ్యక్షుడు 28 రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది.

ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం.. ఇజ్రాయెల్‌లో పతాకస్థాయికి ఉత్కంఠ!
Benjamin Netanyahu, Gadi Eisenkot

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నెతన్యాహు వ్యతిరేక కూటమికి నేతృత్వం వహిస్తున్న మరో కీలక నేత గడీ ఐసెన్‌‌కోట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ఐసాక్ హెర్జొగ్ ఆహ్వానం పలికారు. ఈ దిశగా ఆయనకు 28 రోజుల సమయం ఇచ్చారు. 120 మంది సభ్యులు ఉన్న ఇజ్రాయెల్ పార్లమెంటులో (క్నెసెట్) ప్రభుత్వ ఏర్పాటుకు 61 మంది మద్దతు తప్పనిసరి. ఐసెన్‌కోట్‌కు మద్దతుగా అధ్యక్షుడికి 67 మంది చట్టసభ సభ్యులు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటు అంత సులభం కాదని అక్కడి నిపుణులు చెబుతున్నారు. మద్దతు ప్రకటించడం, ఐసెన్‌కోట్ సారథ్యంలోని ప్రభుత్వంలో కొనసాగడం ఒకటి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.


ప్రభుత్వ ఏర్పాటు.. సాధ్యాసాధ్యాలు

ఐసెన్‌కోట్ సారథ్యంలోని నెతన్యాహు వ్యతిరేక కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో ఆయన సొంత పార్టీ యషర్‌కు 21 మంది చట్టసభ సభ్యులు ఉన్నారు. టూగెదర్ పార్టీ బలం 12. డెమోక్రాట్లకు 8 మంది, ఇజ్రాయెల్ బెయిటిన్యూ పార్టీకి ఏడుగురి బలం ఉంది. రెండు అరబ్ పార్టీలకున్న 19 మంది సభ్యుల బలాన్నీ కలుపుకుంటే కూటమి సంఖ్య 67కు చేరుతుంది. అయితే, నెతన్యాహుపై వ్యతిరేకత మినహా ఈ పార్టీలను కలిపి ఉంచే మరో అంశం లేనేలేదని అక్కడి పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.

అరబ్ పార్టీలతో చిక్కులు..

అరబ్ పార్టీల మద్దతుతో ముందుకు వెళ్లడం ప్రస్తుతం అక్కడి ప్రధాన పార్టీల ముందున్న సులువైన మార్గం. అయితే, సంప్రదాయ వాదిగా పేరున్న అవిగ్డోర్ లిబర్‌మన్ సారథ్యంలోని ఇజ్రాయెల్ బెయిటిన్యూ మాత్రం అరబ్ పార్టీలతో జట్టు కట్టే ప్రతిపాదనను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. దీంతో, అరబ్ పార్టీల దన్నుతో ప్రభుత్వం ఏర్పడినా ఎంతకాలం మనగలదో చెప్పలేని పరిస్థితి ఉందనేది కొందరి వాదన.


మధ్యేమార్గంగా..

అరబ్ పార్టీలు బయట నుంచే మద్దతు ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సంప్రదాయవాదుల నుంచి వ్యతిరేకత తగ్గవచ్చనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. అయినప్పటికీ, నెతన్యాహు నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అరబ్ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వంతో దేశభద్రతకే ముప్పని ఇప్పటికే నెతన్యాహు పలుమార్లు హెచ్చరించారు.

చివరి ఆప్షన్..

ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్ ముందున్న చివరి మార్గం అల్ట్రా ఆర్థొడాక్స్ పార్టీలతో జట్టుకట్టడమేనని కొందరు చెప్పే మాట. యూటీజీ పార్టీకి ప్రస్తుతం 7 చట్టసభ సభ్యులు ఉన్నారు. ప్రధాన పక్షాల్లో ఏ ఒక్కదానికే మద్దతు ఇచ్చే ఉద్దేశం తమకు లేదని యూటీజే గతంలో పేర్కొంది. సంప్రదాయవాద వర్గంలో అతివాదులుగా పేరున్న యూటీజే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిఒక్కరికీ మిలిటరీ సేవను తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతర పార్టీలు మాత్రం కంపల్సరీ మిలిటరీ సర్వీసుకు అనుకూలంగా ప్రచారం చేశాయి.


ఐసెన్‌కోట్‌కు యూటీజే మద్దతు దక్కినా ప్రభుత్వ ఏర్పాటుకు మరింత మంది సభ్యుల మద్దతు అవసరం. మతపెద్దల అంగీకారం ఉంటే షాస్ పార్టీ నిరభ్యంతరంగా ఐసెన్‌కోట్‌కు మద్దతు తెలిపే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ వార్తలను షాస్ ఇప్పటికే తోసి పుచ్చింది. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

నెతన్యాహుకు ఉన్న ప్రత్యామ్నాయాలు..

ప్రభుత్వ ఏర్పాటుకు తమతో కలిసి రావాలని నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీ ఐసెన్‌కోట్‌ను కోరే అవకాశాన్నీ కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ అంశాలపై ఐసెన్‌కోట్ సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువని మరికొందరు చెప్పే మాట. నెతన్యాహు సారథ్యంలో పనిచేసే ఉద్దేశం తనకు అస్సలు లేదని ఐసెన్‌‌కోట్ తేల్చి చెప్పారు. 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడుల సమయంలో ఉన్న పాలకులు ప్రజాజీవితం నుంచి తప్పుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అతివాదులతో సంబంధాలు తెంచుకుని తన సారథ్యంలో పనిచేసేందుకు లికుడ్ పార్టీ సిద్ధమైతే తనకు ఏ అభ్యంతరం లేదని ఐసెన్ కోట్ గతంలో నెతన్యాహుకు ఓ రివర్స్ ఆఫర్ కూడా ఇచ్చారు.


28 రోజుల్లోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే..

అధ్యక్షుడు ఇచ్చిన 28 రోజుల గడువును మరో 14 రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని కూడా ఇజ్రాయెల్ రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అప్పటికీ ఐసెన్‌కోట్‌ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే చివరకు నెతన్యాహుకు అవకాశం దక్కుతుంది. ఆయన కూడా విఫలమైతే మళ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందనేది కొందరు ఇజ్రాయెలీ విశ్లేషకుల అంచనా.


ఈ వార్తలనూ చదవండి:

సౌదీపై హూతీల దాడులు.. ఆరాంకో చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయమే లక్ష్యం..

ఐదుగురిని కాల్చి చంపిన దుండగుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం

Updated Date - Nov 08 , 2026 | 08:19 PM