సౌదీపై హూతీల దాడులు.. ఆరాంకో చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయమే లక్ష్యం..
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:51 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో ఆరు దాడులు చేసినట్లు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో ఆరు దాడులు చేసినట్లు ప్రకటించారు. సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఆరాంకోకు చెందిన చమురు నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు (Houthis Attack Saudi Arabia).
నవంబర్ 7న ఈ దాడులు నిర్వహించినట్లు హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంతమేర నష్టం జరిగిందనే విషయాన్ని సౌదీ ప్రభుత్వం ధ్రువీకరించలేదు. యాహ్యా సరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరు దశల్లో ఈ దాడులు జరిగాయి. మొదటి దాడిలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆరాంకోకు చెందిన చమురు నిల్వ ట్యాంకులు, చమురు శుద్ధి కేంద్రంలోని ఒక టవర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి విజయవంతమైందని హూతీలు ప్రకటించారు (Saudi Aramco Attack).
రెండో దాడిలో సౌదీ అరేబియాలోని ఖురైస్ ప్రాంతంలో ఉన్న ఆరాంకో చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. మూడో దాడిలో దవాద్మీ ప్రాంతంలోని చమురు రవాణా వ్యవస్థకు చెందిన ఎనిమిదో పంపింగ్ కేంద్రంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన మూడు దాడులు సైనిక స్థావరాలు, సైనిక బలగాలపై జరిగినట్లు వెల్లడించారు. సౌదీ నేషనల్ గార్డ్‌కు చెందిన నజ్రాన్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, యెమెన్‌లోని మారిబ్, అల్-జౌఫ్ ప్రాంతాల్లో సౌదీ మద్దతు ఉన్న బలగాలపై మరో రెండు దాడులు నిర్వహించామని చెప్పారు. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరిగినట్లు పేర్కొన్నారు (Houthis Saudi Conflict).
రియాద్ ప్రావిన్స్ వైపు వస్తున్న హూతీల క్రూయిజ్ క్షిపణిని తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రకటించాయి. అంతకుముందు శుక్రవారం రాత్రి ఓ డ్రోన్‌ను కూడా అడ్డుకున్నట్లు సమాచారం. అయితే రియాద్ విమానాశ్రయం, ఆరాంకో చమురు కేంద్రాలపై హూతీల దాడుల వల్ల నిజంగా నష్టం జరిగిందా? విమాన రాకపోకలకు అంతరాయం కలిగిందా? అనే విషయాలపై సౌదీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..