రష్యా చమురు కొంటే సుంకాలు.. బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:28 AM
రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కట్టబెట్టే బిల్లుకు సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, చైనా సహా రష్యా చమురు కొనుగోలు చేసే పలు దేశాలపై సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కట్టబెట్టే బిల్లుకు పెద్దల సభ సెనేట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ విశేష కృషితో తెరపైకి వచ్చిన ఈ బిల్లుకు 86-11 మెజారిటీతో ఆమోదం లభించింది. జులై 28న సెనేట్ గ్యాలరీ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీక్షిస్తుండగా సభ్యులు ఈ బిల్లుపై ప్రొసీడ్యురల్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. తాజాగా భారీ మెజారిటీతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత వారం గ్రాహమ్ అంత్యక్రియలకు వెళ్లిన జెలెన్‌స్కీ ఆ తరువాత రిపబ్లికన్‌లు, డెమోక్రాట్ నేతలతో సమావేశమై రష్యాకు చమురు నిధుల రాకడను కట్టడి చేయడంపై చర్చించారు. చమురు నిధులతోనే రష్యా దాడులు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే భారత్, చైనా సహా రష్యా చమురు, సహజవాయువు కొనుగోలు చేసే టాప్ దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అవకాశం ఉంది. అయితే, తమ అవసరాల్లో 15 శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేస్తూ, దిగుమతులను మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఈ బిల్లులో మినహాయింపును ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర మిలిటరీ అధికారులపై మరిన్ని ఆంక్షలు విధించే అంశాలను బిల్లులో పొందుపరిచారు. యూఎస్ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఇతర పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్న ఆయిల్ ట్యాంకర్లపై కూడా ఆంక్షలను విస్తృత పరిచే నిబంధనలు బిల్లులో ఉన్నాయి.
దేశీయంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సుంకాలు విధించే అధికారాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇవ్వడంపై డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్లు కూడా ఆందోళనతో ఉన్నారు. సెనేట్‌లో కూడా డెమోక్రాట్లే ఈ బిల్లును వ్యతిరేకించారు. సెనేట్‌లో భారీ మెజారిటీ లభించిన నేపథ్యంలో ప్రతినిధుల సభపై కూడా బిల్లును పాస్ చేయాలన్న ఒత్తిడి పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సుంకాలను ఆయుధంగా మలుచుకునే విస్తృత అధికారాలు ఈ బిల్లుతో లభించినప్పటికీ రష్యాను ఇవి అడ్డుకోలేవని డెమోక్రాట్లు చెబుతున్నారు. పైపెచ్చు సుంకాలు, వాణిజ్య యుద్ధాలతో దేశీయంగా ధరాభారం పెరిగి సగటు అమెరికన్ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మొండి బ్యాక్టీరియాపై పోరుకు.. ఏఐ సాయంతో కొత్త వైరస్‌ల సృష్టి
జన్మతః పౌరసత్వానికి ట్రంప్ ఎసరు!