జన్మతః పౌరసత్వానికి ట్రంప్ ఎసరు!
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:28 AM
అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రయత్నం మొదలుపెట్టారు. జన్మతః పౌరసత్వాన్ని అడ్డుకునేందుకు..
అమెరికాలో జన్మించే విదేశీయుల పిల్లలకు పౌరసత్వంపై కొత్త నిబంధనలు
నెలలు నిండాక అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నించే మహిళలను అడ్డుకునే చర్యలు
వాణిజ్య లావాదేవీల కోసం అమెరికా వచ్చిన మహిళల పిల్లలకు పౌరసత్వం నిరాకరణ
ఇలాంటి మరిన్ని రూల్స్‌తో 2 ఆదేశాలు జారీ
గత ఆదేశాల్ని కోర్టు కొట్టేసినా తగ్గని ట్రంప్
వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో ప్రయత్నం మొదలుపెట్టారు. జన్మతః పౌరసత్వాన్ని అడ్డుకునేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ట్రంప్ తాజాగా రెండు ఆదేశాలను జారీ చేశారు. జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేయడం.. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించేలా గర్భిణులు నెలలు నిండే సమయంలో అమెరికాకు వచ్చి, ప్రసవించే ‘బర్త్ టూరిజం’ను అడ్డుకోవడం లక్ష్యంగా కఠిన నిబంధనలను విధించారు. వాణిజ్య లావాదేవీల కోసం అమెరికాకు వచ్చి బిడ్డలకు జన్మనిచ్చిన మహిళల పిల్లలు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తుల పిల్లలు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం జన్మతఃపౌరసత్వం హక్కు లభించని ప్రాంతాల్లో పుట్టిన పిల్లలకు.. జన్మతః పౌరసత్వం వర్తించదని పేర్కొన్నారు. ట్రంప్ తాజా ఆదేశాలు కూడా రాజ్యాంగ విరుద్ధమని అమెరికా న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య లావాదేవీల కోసం వచ్చే మహిళలు అన్న అంశంపై స్పష్టమైన నిర్వచనం లేదని, ఇది ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.