Share News

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:58 PM

యూఎస్‌తో చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్‌పై దాడులు ఆగడం, ఇరాన్ ఆస్తులపై ఆంక్షల తొలగింపు జరిగితేనే చర్చలు మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!
US Iran talks Islamabad

ఇంటర్నెట్ డెస్క్: పాక్ వేదికగా యూఎస్‌-ఇరాన్ చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన షరతుల విషయంలో ఇరాన్ వెనక్కు తగ్గట్లేదని అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర టీమ్ సభ్యులు ఇస్లామాబాద్‌లో కాలుపెట్టి నాలుగు గంటలకు పైనే అవుతున్నా ఇప్పటికీ ఇరాన్ బృందంతో నేరుగా సమావేశం కాలేదని తెలుస్తోంది. నేరుగా సమావేశాలు జరిగే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో పాక్ ద్వారా పరోక్ష చర్చలు ప్రారంభం కావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే, ఇందుకు కూడా ఇరాన్ కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది.


పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే జేడీ వాన్స్‌తో సమావేశమయ్యారు. మరోవైపు, ఇతర పాక్ ఉన్నతాధికారులు అటు యూఎస్ అధికారులతో పాటు ఇరాన్ అధికారులతో కూడా వేర్వేరుగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్స్‌లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్, విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ కూడా పాల్గొన్నారు. ఇక పాక్ సాయంతో చర్చలు ప్రారంభించాలంటే ముందుగా లెబనాన్‌పై దాడులు ఆగాలని ఇరాన్ స్పష్టం చేసిందని సమాచారం. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని షరతు విధించింది. ఖతార్‌తో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులపై తక్షణం ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి యూఎస్, పాక్, ఇరాన్ దేశాలు చర్చలను ఎలా ముందుకు తీసుకెళుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. సగటున రోజుకు ఒక విహంగాన్ని కోల్పోయిన యూఎస్

Updated Date - Apr 11 , 2026 | 06:24 PM