Share News

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ABN , Publish Date - Apr 11 , 2026 | 07:31 PM

యూఎస్, ఇరాన్ చర్చలు మొదలైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నిజాయతీని గమనిస్తుంటానని అన్నారు.

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Trump warns Iran Over negotiations

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్, ఇరాన్‌ల మధ్య ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. చర్చలకు ముందే ఇరాన్ పలు షరతులు విధించిందన్న వార్తల నేపథ్యంలో దాదాపు ఐదు గంటల ఆలస్యంగా చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లో నిజాయతీ ఎంత ఉందో గమనిస్తుంటానని అన్నారు. చర్చల ఫలితం ఎలా ఉంటుందో తాను చెప్పలేనని కూడా అన్నారు.

ఈ సందర్భంగా ఇరాన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివర్ణించారు. దౌత్యం విఫలమైతే యూఎస్ తన పంథాను పూర్తిగా మార్చుకుంటుందని అన్నారు. ఇరాన్‌తో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ‘సమీప భవిష్యత్తులోనే హోర్ముజ్ తెరుచుకుంటుంది’ అని కూడా చెప్పారు. హోర్ముజ్‌కు ప్రత్యామ్నాయాలు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక యూఎస్‌తో తమ ప్రభుత్వ చర్చలు కొనసాగుతాయని ఇరాన్ ప్రభుత్వ మీడియాలోనూ వార్తలు వెలువడ్డాయి.


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇస్లామాబాద్‌లో దిగాక కూడా వాన్స్ బృందం ఇరాన్‌తో చర్చలు ప్రారంభించలేదు. ఇరాన్ విధించిన షరతులు, పరస్పర అపనమ్మకం కారణంగా చర్చలు ఆలస్యంగా ప్రారంభమైనట్టు సమాచారం. నేరుగా చర్చలు జరపడం సాధ్యం కాని పక్షంలో పాక్ మధ్యవర్తిగా త్రైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

Updated Date - Apr 11 , 2026 | 07:50 PM