చర్చలపై సందిగ్ధం!
ABN , Publish Date - Apr 22 , 2026 | 03:54 AM
అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చల కోసం రంగం సిద్ధమైనా.. చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటం, ఇరాన్ నౌకను అమెరికా సేనలు స్వాధీనం చేసుకోవడంతో ......
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల భేటీకి ఏర్పాట్లు
బుధవారమే చర్చలు జరుగుతాయన్నా.. పాకిస్థాన్‌కు చేరుకోని ఇరుదేశాల నేతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చల కోసం రంగం సిద్ధమైనా.. చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటం, ఇరాన్ నౌకను అమెరికా సేనలు స్వాధీనం చేసుకోవడంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందేమోనన్న ఆందోళన మధ్య.. శాంతి చర్చల దిశగా మంగళవారం అడుగులు పడ్డాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగానే మలివిడత చర్చలు జరుగుతాయని సంకేతాలు వచ్చాయి. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ప్రతినిధులు, ఇరాన్ నుంచి పార్లమెంటు స్పీకర్ ఘలీబఫ్, ఇతర ప్రతినిధులు బుధవారం తెల్లవారుజామున ఇస్లామాబాద్‌కు చేరుకోనున్నట్టు పాకిస్థాన్ దౌత్యవర్గాలు తెలిపాయి. కానీ చర్చల్లో పాల్గొనడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాత్రి 10గంటల సమయంలో ఇరాన్ టీవీ వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి దాటినా అమెరికా నుంచిగానీ, ఇటు ఇరాన్ నుంచి గానీ నేతలు ఇస్లామాబాద్‌కు బయలుదేరలేదు.
కాల్పుల విరమణపై గందరగోళం
యుద్ధ విరమణ కోసం ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి దఫా ఉన్నతస్థాయి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీనితో ఇరాన్ పోర్టులు, నౌకలను అమెరికా దిగ్బంధించడంతో ఉద్రిక్తత పెరిగింది. యుద్ధం మళ్లీ మొదలవుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. దానికితోడు అమెరికా, ఇరాన్ మధ్య ఏప్రిల్ 8వ తేదీన మొదలైన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం గడువు బుధవారం ఉదయంతో ముగియనుంది. అయితే చర్చల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని దౌత్యవర్గాలు వెల్లడించాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ఫలవంతంగా జరిగి, ఒప్పందం కుదిరే దశకు చేరితే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇస్లామాబాద్‌కు చేరుకుని ప్రత్యక్షంగా గానీ, వర్చువల్‌గా పాల్గొనడంగానీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. చర్చల్లో పాల్గొంటున్న కీలక పాకిస్థానీ దౌత్యవేత్తలను ఉటంకిసూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. అయితే అంతకుముందు, ఇరాన్‌ను అమెరికా లొంగదీసుకోవాలని చూస్తోందని, అలాంటి బెదిరింపుల మధ్య చర్చలను అంగీకరించబోమని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘలీబఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘2వారాల్లో మేం యుద్ధ రంగంలోకి సరికొత్త ఆయుధాలను తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. యుద్ధం కొనసాగే పరిస్థితి తలెత్తితే బయటికి తీస్తాం’’ అని హెచ్చరించారు.
చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి రసాయనాలు!
అమెరికా నావికాదళం స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌక ‘తౌస్కా’లో.. చైనా నుంచి ఇరాన్‌కు సరఫరా అవుతున్న క్షిపణి తయారీ రసాయన పదార్థాలు ఉన్నాయని అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ఆరోపించారు. ఈ ఆరోపణలను చైనా ఖండించింది. ఆ నౌకతో తమకు సంబంధం లేదని పేర్కొంది. కాగా, ఇరాన్ చమురును సరఫరా చేస్తూ అమెరికా ఆంక్షలకు గురైన భారీ ట్యాంకర్ నౌక ‘ఎంటీ టిఫానీ’ని హిందూమహాసముద్రంలో స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా తెలిపింది.
ఒప్పందానికి రాకుంటే బాంబులే: ట్రంప్
కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై భారీ స్థాయిలో బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్‌కు మంచి అవకాశం ఉంది. ఒప్పందానికి వస్తే వారి దేశాన్ని మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. లేకపోతే ఆ దేశంపై భారీగా బాంబులు వేస్తాం’’ అని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పిడి జరిగినట్టేనని, అయితే దాన్ని పరోక్షంగా సాధించామని పేర్కొన్నారు. కాల్పుల విరమణను పొడిగించే ఉద్దేశమేదీ లేదని చెప్పారు. కాల్పుల విరమణ అమలు చేసిన ఈ రెండు వారాల్లో అమెరికా మిలిటరీ ఆయుధాలన్నీ తిరిగి సిద్ధం చేసుకుందన్నారు. సైన్యం ఉత్సాహంగా ఉందని.. తాను ఆదేశించిన వెంటనే దాడి చేసేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని చెప్పారు.