Share News

యూఎస్‌లో పౌరసత్వ రద్దుకు చర్యలు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో..

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:30 AM

చట్టాలను ఉల్లంఘించిన వారి పౌరసత్వ రద్దు కోసం అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది.

యూఎస్‌లో పౌరసత్వ రద్దుకు చర్యలు.. మునుపెన్నడూ చూడని స్థాయిలో..
US Denaturalization Drive

ఇంటర్నెట్ డెస్క్: స్థానిక చట్టాలను ఉల్లంఘించిన వారి పౌరసత్వ రద్దు కోసం అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. మొత్తం 40 మంది పౌరసత్వ రద్దు కోసం కార్యాచరణ ప్రారంభించినట్టు యూఎస్ న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ దేశ ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద పౌరసత్వ రద్దు కార్యక్రమమని చెప్పింది. వీరిలో ఓ భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పౌరసత్వ రద్దు ముప్పు ఎదుర్కొంటున్న వారు పలు తీవ్ర నేరాలకు పాల్పడినట్టు అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ఆరోపించారు. విదేశీ ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం, వ్యక్తి మరణానికి కారణం కావడం, మాసికవైకల్యం ఉన్న వారిపై లైంగిక దాడి ఆరోపణలు, వీసా చట్టాలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరిపై స్థానిక కోర్టుల్లో విచారణ జరుగుతోంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం, స్థానిక చట్టాలను ఉల్లంఘించిన విదేశీ సంతతి వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.


భారత సంతతి వ్యక్తిపై ఆరోపణలు..

రెండు వేర్వేరు గుర్తింపులతో వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు బల్వీందర్‌ సింగ్‌ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కాలిఫోర్నియాలో ఉంటున్న బల్వీందర్ సింగ్ తప్పు చేసిన విషయం అతడి ఫింగర్‌ప్రింట్స్ పరిశీలనతో వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. 1999లో ఒక గుర్తింపుపై ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ దాఖలు చేసిన అతడు 2003లో మరో గుర్తింపుతో శాశ్వత నివాసార్హత పొందినట్టు అధికారులు తెలిపారు. అనేక సందర్భాల్లో బల్వీందర్ సింగ్ చర్యలు అతడి నైతికతపై సందేహం కలిగించేలా ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది.


ఇక గూఢచర్యానికి పాల్పడుతున్నందుకు ఓ చైనా వ్యక్తి పౌరసత్వం కూడా రద్దు చేసేందుకు యూఎస్ ఉపక్రమించింది. 2021లో నేవీలో చేరిన ఆ చైనా వ్యక్తి 2022 నుంచి మిలిటరీ రహస్యాలను చైనాకు విక్రయించడం ప్రారంభించాడని పేర్కొంది. 2022 మేలో అతడికి అమెరికా పౌరసత్వం దక్కిందని తెలిపింది. ఈ కేసులో అతడు 2025 ఆగస్టులో దోషిగా తేలాడు. పాకిస్థాన్, మెక్సికో, కాంబోడియా, నేపాల్, అఫ్గానిస్థాన్ దేశాల వారి పౌరసత్వ రద్దుకు చర్యలు తీసుకుంటున్నామని న్యాయశాఖ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

ఆ విమానాన్ని కూల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్

సౌదీపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు.. రంగంలోకి మక్కా డిఫెన్స్ అలైన్స్

Updated Date - Oct 06 , 2026 | 12:03 PM