Share News

ఇప్పటివరకూ ఒక్కరికే ట్రంప్ గోల్డ్ కార్డు: యూఎస్ మంత్రి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:40 AM

ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే గోల్డ్ కార్డును మంజూరు చేశామని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, వందల సంఖ్యలో దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసార్హత కల్పించే గోల్డ్ కార్డు స్కీమ్‌ను అధ్యక్షుడు ట్రంప్ గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించారు.

ఇప్పటివరకూ ఒక్కరికే ట్రంప్ గోల్డ్ కార్డు: యూఎస్ మంత్రి
Howard Lutnick

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే గోల్డ్ కార్డు దక్కింది. ఈ విషయాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ (చట్టసభలు) కమిటీకి ఈ వివరాలను గురువారం ఆయన వెల్లడించారు.

గోల్డ్ కార్డు కావాలనుకునే విదేశీయులు 1 మిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అదనం. అయితే, ఈ స్కీమ్‌కు డిమాండ్ అద్భుతంగా ఉందని మొదట్లో లుట్నిక్ చెప్పుకొచ్చారు. ఏకంగా 1.3 బిలియన్ డాలర్ల విలువైన వాటిని జారీ చేశామని అప్పట్లో అన్నారు. ఇందుకు భిన్నంగా ఆయన కేవలం ఒక్క గోల్డ్ కార్డును మాత్రమే జారీ చేశామని తాజాగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వందల సంఖ్యలో గోల్డ్ కార్డు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని లుట్నిక్ కాంగ్రెస్ కమిటీకి చెప్పారు.


వీసా కోసం జనాలు క్యూకట్టారని కూడా లుట్నిక్ అన్నారు. అధికారులు ఈ మధ్యనే పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కూడా చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైన వారికి కేవలం ఐదేళ్లల్లోనే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.


ఈ వార్తలనూ చదవండి:

పాక్‌లో చర్చలు.. పెద్ద తప్పే చేశాము: ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు

ట్రంప్ ప్రభుత్వం దూకుడు.. పౌరసత్వాల రద్దుకు రంగం సిద్ధం!

Updated Date - Apr 24 , 2026 | 12:05 PM