Share News

ఇకపై ఏడాది పొడవునా ఒకే టైమ్.. యూఎస్ ప్రతినిధుల సభలో కీలక బిల్లు పాస్!

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:12 PM

ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌'ను ఏడాది పొడవునా శాశ్వతం చేయడం కోసం ప్రవేశపెట్టిన ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’‌ బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

ఇకపై ఏడాది పొడవునా ఒకే టైమ్.. యూఎస్ ప్రతినిధుల సభలో కీలక బిల్లు పాస్!
Daylight Saving Time

ఇంటర్‌నెట్ డెస్క్: ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికేందుకు అమెరికా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 'డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌'ను ఏడాది పొడవునా శాశ్వతం చేయడం కోసం ప్రవేశపెట్టిన ‘సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్’‌ బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 308-117 ఓట్ల భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది.


ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు అధ్యక్షుడు సంతకం చేస్తే అధికారిక చట్టంగా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే ఈ గడియారాలు మార్చే విధానాన్ని ముగిస్తానని గతంలోనే ఆయన హామీ ఇచ్చారు. ఈ చట్టం వల్ల ప్రజలకు సాయంత్రం పూట ఎక్కువ సమయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ఈ బిల్లుపై అతి త్వరలో సంతకం చేయనున్నారు.


ఇంతకీ ఏంటీ డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌..

సూర్యుడు త్వరగా ఉదయించే వేసవి నెలల్లో.. ఉదయం 4 నుంచి 5 గంటలకే ఎండ వచ్చేస్తుంది. ఆ సమయంలో చాలామంది నిద్రపోతుంటారు. చాలా వరకు సమయం నిద్రలోనే వృధా అవుతుంది. గడియారాన్ని ఒక గంట ముందుకు జరపడం వల్ల.. సాయంత్రం పూట సహజమైన సూర్యకాంతిని ఎక్కువ సమయం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఐరోపా దేశాలతో పాటు దాదాపు 70కి పైగా దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. అమెరికన్లు వేసవి కాలంలో గడియారాలను ఒక గంట ముందుకు జరుపుతారు. దీన్నే ‘స్ప్రింగ్ ఫార్వర్డ్’ అంటారు. శీతాకాలంలో మళ్లీ ఒక గంట వెనక్కి జరుపుతారు. దీన్నే ‘ఫాల్ బ్యాక్’ అంటారు. ఇలా సమయాన్ని మార్చే విధానాన్ని పూర్తిగా ఆపేసి.. ఏడాది పొడవునా ఒకే టైమ్ ఉంచాలనే ఉద్దేశంతోనే అమెరికా ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకువచ్చింది.


ఇవి కూడా చదవండి

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది ఆ ఇద్దరే: వాషింగ్టన్ సుందర్

Updated Date - Jul 15 , 2026 | 12:39 PM