రష్యాలో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న మిస్టరీ
ABN , Publish Date - Aug 25 , 2026 | 07:27 PM
అమెరికాకు చెందిన ఎయిర్‌పోర్స్ విమానం రష్యాలో దిగడం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన భారీ ఎయిర్‌ఫోర్స్ విమానం రష్యాలో దిగడం ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రవాణా కార్యకలాపాలకు ఉపయోగించే బోయింగ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం మాస్కోకు సమీపంలోని నుకోవో ఎయిర్‌పోర్టులో మంగళవారం దిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, ఆర్‌సీహెచ్4555, 07-7181 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న విమానం రష్యా పొరుగుదేశమైన లాట్వియా నుంచి బయలు దేరింది. స్థానిక కాలమానం ప్రకారం మాస్కోలో మంగళవారం ఉదయం 10.00గలకు ల్యాండైంది. అసలు విమానం రష్యాకు ఎందుకు వెళ్లిందనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. విమానంలో ఎవరైనా కీలక అధికారులు ఉన్నారా? లేక కీలక పరికరాలు ఏమైనా రవాణా చేస్తున్నారా? అనే విషయాలపై స్పష్టత కొరవడింది. అసలు తమకు ఆ విమానం గురించి ఏమీ తెలియదని రష్యా వర్గాలు చెప్పడంతో ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఈ వార్తలపై అటు యూఎస్, ఇటు రష్యా ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.
అమెరికా నుంచి బయలుదేరి..
మీడియా కథనాల ప్రకారం, ఈ ఎయిర్‌ఫోర్స్ విమానం యూఎస్‌లోని క్యాంప్ స్ప్రింగ్స్ నుంచి బయలుదేరింది. అమెరికాలోని ప్రధాన వైమానిక స్థావరమైన యూఎస్ ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ క్యాంప్ స్ప్రింగ్స్‌లోనే ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్‌ను ఈ స్థావరంలోనే నిలిపి ఉంచుతారు. అమెరికా ప్రభుత్వ కీలక అధికారుల విదేశీ పర్యటనలన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రష్యాలో ఏం జరుగుతోందనే దానిపై రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి యూఎస్, రష్యా మధ్య చర్చలు ప్రస్తుతం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇరాన్ యుద్ధంతో ట్రంప్ బిజీగా ఉన్న నేపథ్యంలో రష్యాతో చర్చలకు కాస్త ప్రాధాన్యం తగ్గింది. ఈ చర్చలను మళ్లీ గాడీలో పెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ రష్యాకు వెళతారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. కీలక అధికారుల పర్యటలనకు ముందు పలు సామగ్రిని తరలించేందుకు కూడా సీ-17గ్లోబ్ మాస్టర్‌ను అమెరికా వినియోగిస్తుండటంతో తదుపరి ఏం జరగబోతోందో అన్న మిస్టరీ నెలకొంది. అమెరికా ప్రత్యేక ప్రతినిధులైన స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్ త్వరలో రష్యాకు వెళ్లనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరిలో విట్కాఫ్, జేరెడ్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్‌తో వాణిజ్యం.. టాప్‌లో ఉన్న దేశం ఇదే..
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..