Share News

ఇరాన్‌తో వాణిజ్యం.. టాప్‌లో ఉన్న దేశం ఇదే..

ABN , Publish Date - Aug 25 , 2026 | 06:35 PM

ఇరాన్‌పై భారీ స్థాయి ఆర్థిక ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ఉన్న టాప్ వాణిజ్య భాగస్వాములు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇరాన్‌తో వాణిజ్యం.. టాప్‌లో ఉన్న దేశం ఇదే..
Iran's Top Trading Partners

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే ఆర్థిక ఆంక్షలకు సిద్ధం అవుతున్నట్టు అమెరికా ప్రకటించింది. వాణిజ్య పరంగా ఇరాన్‌ను ఏకాకిని చేసి దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్‌తో వాణిజ్యం నెరపే దేశాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇరాన్‌తో వాణిజ్యం జరిపే దేశాల్లో చైనా టాప్‌లో ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ముడిచమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం చైనాకు చేరుతున్నాయి. ఇరాన్ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కూడా భారీగా పెట్టుబడి పెట్టింది. 2025లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 9.96 బిలియన్ డాలర్లుగా నిలిచింది. అయితే, వాస్తవ వాణిజ్యం దీనికి మూడు రెట్లకు పైగా ఉంటుందని అమెరికా చెబుతోంది.

భారత్ కూడా గతంలో ఇరాన్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకునేది. అయితే, అమెరికా ఆంక్షలు విధించడంతో కొంతకాలంగా దిగుమతులు తగ్గిపోయాయి.


తుర్కియేకి కూడా ఇరాన్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముడిచమురును దిగుమతి చేసుకోవడంతో పాటు పలురకాల వస్తువులను ఇరాన్‌కు ఎగుమతి చేస్తోంది. 2024లో ఇరు దేశాల మధ్య 5.7 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.

యూఏఈ కూడా ఇరాన్‌కు కీలక భాగస్వామిగా ఉంది. ఇరాన్ ఉత్పత్తి చేసిన వస్తువులు అనేకం యూఏఈ మీదుగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అయితే, ఇటీవల దాడుల నేపథ్యంలో యూఏఈ ఇరాన్‌పై గుర్రుగా ఉంది. మునుపటి వాణిజ్యానికి చాలా వరకూ బ్రేకులు పడ్డాయి.

తన విద్యుత్, ఇంధన అవసరాల కోసం ఇరాక్ ఇరాన్‌పైనే అధికంగా ఆధారపడుతోంది. ఐదేళ్ల పాటు సహజవాయువు సరఫరా కోసం ఇరాక్ 2024లో ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒకప్పుడు ఐరోపా సమాఖ్య, ఇరాన్‌కు మధ్య చెప్పుకోదగ్గ స్థాయిలో వాణిజ్య సంబంధాలు ఉండేవి. ఆంక్షలు అమల్లోకి వచ్చాక వాణిజ్యం చాలా వరకూ తగ్గిపోయింది.


ఆంక్షల ప్రభావం ఇలా..

అమెరికా మరిన్ని ఆంక్షలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఇరా‌న్‌కు ముడిచమురును ఎగుమతి చేయడం మరింత కష్టంగా మారనుంది. బ్యాంకింగ్ రంగంతో పాటు షిప్పింగ్ రంగంలో కూడా తీవ్ర అడ్డంకులు ఎదురుకానున్నాయి. ఇంధన అవసరాల కోసం ఇరాన్‌పై అధికంగా ఆధారపడే దేశాలకు మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. చివరకు పలు దేశాలు ఇరాన్‌తో వాణిజ్యానికి చెక్ పెట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 25 , 2026 | 07:28 PM