Share News

చైనా అధినేతతో శిఖరాగ్ర సమావేశం.. జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు

ABN , Publish Date - May 14 , 2026 | 09:53 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తమ దేశాలకు ఉమ్మడిగా బంగారు భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.

చైనా అధినేతతో శిఖరాగ్ర సమావేశం.. జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు
Trump-Xi Summit

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్ మధ్య నేడు బీజింగ్‌లో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరు దేశాల బృందాలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్ చైనా అధినేతపై ప్రశంసలు కురిపించారు. జిన్‌పింగ్‌ను కలవడం తనకు గౌరవమని, ఆయన తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. ఇరు దేశాలకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.

‘మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పొరపొచ్చాలు వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుని త్వరగా పరిష్కరించాము. మీరు ఒక గొప్ప నాయకుడు. ఇలా నేను మిమ్మల్ని ప్రశంసించడం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. చైనా, అమెరికాలు కలిసికట్టుగా అధ్బుత భవిష్యత్తువైపు అడుగులు వేస్తున్నాయి ’ అని ట్రంప్ అన్నారు.

ఈ పర్యటన కోసం తాను అమెరికాకు చెందిన అత్యుత్తమ వ్యాపారవేత్తలను తీసుకొచ్చానని కూడా ట్రంప్ చెప్పారు. వారందరికీ చైనా అధినేత అంటే గౌరవమని చెప్పారు. ఇదే అతిపెద్ద శిఖరాగ్ర సమావేశమని కూడా వ్యాఖ్యానించారు.


ఇక ఈ సమావేశాల ప్రారంభంలో చైనా అధినేత జిన్‌పింగ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని అభిలషించారు. చైనా-యూఎస్ బంధం స్థిరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టి తమ రెండు దేశాలపైనే ఉందని అన్నారు. గత శతాబ్దంలో చూడని మార్పులు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని, ప్రపంచం నాలుగు రోడ్ల కూడలిలో ఉందని అభిప్రాయపడ్డారు. చైనా, యూఎస్‌లు తమ దౌత్య బంధంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కూడా వ్యాఖ్యానించారు

రెండు రోజుల పాటు జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎన్‌విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పాల్గొంటున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరాన్‌ యుద్ధం, టెక్నాలజీతో పాటు తైవాన్ అంశంపై కూడా చర్చించేందుకు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాసింజర్ విమానాలను చైనాకు మరింతగా ఎగుమతి చేసేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌ను దాటిన మరో ఎల్‌పీజీ ట్యాంకర్.. త్వరలో భారత్‌కు..

అమెరికాలో ఓపీటీ దుర్వినియోగం..

Updated Date - May 14 , 2026 | 10:50 AM